హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే సంగతి వదిలేస్తే… ముందస్తుగానే ఇక్కడ ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే హుజూరాబాద్ లో మకాం వేసి ప్రభుత్వం అమలు చేస్తన్న పథకాలను వివరిస్తూ, పార్టీ నుంచి నిష్క్రమించిన ఈటెల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రాజకీయ పావులు కదులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను సీఎం అప్పగించారు. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా ఇక్కడ కీలక బాధ్యతలు అప్పజెప్పారనే సమాచారం వస్తోంది. హుజూరాబాద్ అభివృద్ధికి రూ. 40 కోట్ల నిధులను కూడా తాజాగా మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈటెలను ఓటమి బాట పట్టించడం ద్వారా 2023 సాధారణ ఎన్నికలపై బీజేపీ ఆశలను వమ్ము చేయాలనేది కేసీఆర్ టార్గెట్ గా టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే దశలో హుజూరాబాద్ లో ఈటెలను గెలిపించుకోవడం ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పడిపోయిన గ్రాఫ్ ను పెంచుకోవాలనేది బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థ ఎవరనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరు కొద్దిరోజుల క్రితం వినిపించినప్పటికీ, ఆయన ధ్యాసంతా వేములవాడ నియోజవర్గంపై ఉందంటున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు కుటుంబం నుంచి అభ్యర్థి ఉంటారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ఆయన కుటుంబంలో ఇప్పటికే ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే పదవులు ఉన్నాయని, ఇప్పుడు హుజూరాబాద్ టికెట్ కూడా ఆయన కుటుంబానికే ఇస్తే ప్రతికూల సంకేతాలు ఏర్పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. హుజూరాబాద్ లో పోటీపై కెప్టెన్ కుటుంబమే ఆసక్తిగా లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోదరుని వరుసైన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని, ఆయనే అభ్యర్థి కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ చెవిలో గుసగుసలాడిన ఫొటోలు వైరల్ గా మారి వివాదాస్పద ప్రచారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, మంత్రి కేటీఆర్ ను అనూహ్యంగా ప్రయివేట్ కార్యక్రమంలో కలవాల్సి వచ్చిందని, ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదని కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అయితే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడేనాటికి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది వేరే విషయం.

మంత్రి కేటీఆర్ తో గెల్లు శ్రీనివాస యాదవ్ (ఫైల్ ఫొటో)

ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ పై పోటీకి బీసీ సామాజికవర్గం నుంచే అభ్యర్థిని అధికార పార్టీ రంగంలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అనే నేత పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సామాజికపరంగా ఆయన బలం, బలగంపై అధికార పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. దరిమిలా బీసీ వర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస యాదవ్ అనే నాయకుడి పేరు తాజాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న గెల్లు శ్రీనివాస యాదవ్ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లపాటు ఈటెల రాజకీయ కదలికలపై కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ కు అందించడంలో శ్రీనివాస యాదవ్ చురుగ్గా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల సామాజిక వర్గమైన ముదిరాజ్ ల ఓట్లు సుమారు 20 వేల వరకు ఉండగా, గెల్లు శ్రీనివాస యాదవ్ కు చెందిన సామాజిక బలం ఓట్ల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందంటున్నారు. ఆయా సమీకరణలతోపాటు ఇతరత్రా అనేక అంశాలు గెల్లు శ్రీనివాస యాదవ్ కు కలిసి వచ్చే అవకాశాలుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే చివరి నిమిషం వరకు కూడా గులాబీ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అంచనా వేయలేమని, అంతిమంగా ఆయన తీసుకునే నిర్ణయమే అభ్యర్థిని ఖరారు చేస్తుందనే విషయం తెలిసిందే.

Comments are closed.

Exit mobile version