ఎన్నిక ఏదైనా ‘కారు’దే జోరు… తెలంగాణాలో అధికార పార్టీ నేతల నినాదమిది. సాధారణ ఎన్నికల్లోనే కాదు, ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ సాధించిన విజయాలు చరిత్రాత్మకం. ఇందులో ఏ సందేహం లేదు. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కలిసి వచ్చే అంశాలు అనేకంగా ఉంటాయి. మందీ, మార్బలం, అర్ధబలం, అంగబలం వంటి అనేక అంశాలు ప్లస్ పాయింట్ గా ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, ఇతరత్రా నామినేటెడ్ పదవుల్లో గల ముఖ్య నేతలు… ఒక్కరేమిటి…? వందలాది మంది నాయకులు ఒకే చోట వాలిపోతారు. అధికార పార్టీ రాజకీయాల్లో ఇది సహజంగా కనిపించే దృశ్యం. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా కూడా ఉండకపోవచ్చు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఇంకా అనేకం ఉంటాయ్. ఫలితం కూడా సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇన్ని సానుకూల పరిస్థితులు, పరిణామాలు ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ చేదు ఫలితాలను చవి చూసిన ఘటనలు కూడా లేకపోలేదు.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం. కరోనా కల్లోల పరిణామాల్లో ఎన్నికల సంఘం ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రకటిస్తుందా? లేదా? అనేది వేరే ప్రశ్న. తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల విషయంలోనే ఈసీ ‘నో’ అనడం ఈ సందర్భంగా గమనార్హం. అయితే వచ్చే ఆరు నెలల వ్యవధిలో కరోనా పరిస్థితులు చక్కబడితే, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక్కడ ‘గెలుపు’ అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగానే రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఏడేళ్ల క్రితం 2014లో ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ సాధారణ ఎన్నికల్లోనే కాదు, అనేక ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలనే తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా గులాబీ పార్టీ సంచలన గెలుపును సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన కొన్ని ఉప ఎన్నికలను పరిశీలిస్తే…

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆనారోగ్యంతో మరణించిన కారణంగా పాలేరు నియోజకవర్గానికి 2016లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే చొప్పున పాలేరుతో క్యాంపు వేసిన అధికార పార్టీ నేతల వ్యూహాల ముందు రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి విజయం సాధించలేకపోయారు. కానీ దాదాపు 52 వేల ఓట్లను ఆమె సాధించడం విశేషం.

ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతిని కాంగ్రెస్ పార్టీ పోటీకి దింపగా, టీఆర్ఎస్ శానంపూడి సైదిరెడ్డిని అభ్యర్థిగా బరిలో నిలిపింది. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణిని గెలిపించుకునే అవకాశాన్ని ఇవ్వకుండా టీఆర్ఎస్ పావులు కదిపి విజయం సాధించింది.

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన పరిణామాల్లో ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరిగింది. రామలింగారెడ్డి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడం, సానుభూతి పవనాల వంటి అనేక అంశాలను బేరీజు వేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతను పోటీకి దింపింది. మంత్రి హరీష్ రావు ఇంచార్జిగా వ్యవహరించినప్పటికీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినప్పటికీ అధికార పార్టీ చేదు ఫలితాన్ని చవి చూసింది. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితపు ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపైనా పడింది. ఫలితం తెలిసిందే.

అటు దుబ్బాక, ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాల దూకుడుకు కళ్లెం వేయాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహరచన చేశారు. నోముల నర్సింహయ్య మృతి కారణంగా ఉప ఎన్నిక జరిగిన నాగార్జునసాగర్ లో గెలుపు వ్యూహాలను స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షించడం గమనార్హం. దరిమిలా కాకలు తీరిన రాజకీయ నేతగా ప్రాచుర్యం పొందిన కాంగ్రెస్ నేత జానారెడ్డి నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ చేతిలోనూ ఓడిపోక తప్పలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్లగొండ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆయా సాధారణ, ఉప ఎన్నికలకు, నోటిఫికేషన్ వెలువడితే జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికకు చాలా వ్యత్యాసముందనే వాదన వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పరిణామాలే ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి అదే పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ పార్టీకి, చివరికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన పరిణామాలు తెలిసిందే. హుజూరాబాద్ లో ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థుల కారణంగా ఉప ఎన్నిక జరగడం లేదు. సొంత పార్టీలో 19 ఏళ్ల అనుబంధం గల ఈటెల రాజేందర్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు దారి తీశాయనేది కాదనలేని వాస్తవం. అధికార పార్టీ ఇక్కడ ఒకప్పటి తమ సహచర ఉద్యమ నాయకుడితోనే తలపడాల్సిన పరిస్థితి. మందీ మార్బలం, అర్థబలం, అంగబలం వంటి అనేక అంశాలు అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశాలే కావచ్చు. కానీ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని వెతుక్కోవలసిన పరిస్థితులే విచిత్ర పరిణామంగా పరిశీలకుల భావన.

ఇంతకీ హుజూరాాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? సొంత పార్టీకి చెందిన బోయినపల్లి వినోద్ కుమారా? రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు కుటుంబ సభ్యులా? హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డా? గులాబీ పార్టీ కండువా కప్పుకుంటే… కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డా? లేక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డా? టీడీపీ తెలంగాణా అధ్యక్షుడు ఎల్ రమణనా? ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థి? ఇదీ తాజా చర్చ. మొత్తంగా గులాబీ పార్టీకి ఇప్పుడు హుజూరాబాద్ లో అభ్యర్థి అన్వేషణ అనివార్యమైందా? ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయకపోవడమే ప్రస్తుత స్థితికి ప్రధాన కారణమా? ఔనన్నా, కాదన్నా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం, ఈటెల రాజేందర్ కు రాజకీయ సంకటంగానే పలువురు అభివర్ణిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను ఈటెల రాజేందర్ ఎలా ఎదుర్కుంటారనేది వేచి చూడాల్సిందే.

Comments are closed.

Exit mobile version