ఈ తీహార్ జైలు అధికారులకు బొత్తిగా కనికరం లేదండి. దయ, క్షమ గుణాలు కూడా ఏమాత్రం ఉన్నట్లు కనిపించడం లేదు. ఏంటండీ… మరీ చోద్యం కాకపోతే? ఆయనేమన్నామామూలు నేరగాడా ఏంటి? పద్దెనిమిదేళ్ల చిరుప్రాయంలోనే నేర విద్యను నర నరాన ఒంట బట్టించుకున్నాడు. హర్యానాలో చిన్నదోపిడీతో తన నేర చరిత్రకు బోణీ చేశాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆదర్శంగా తీసుకున్నాడు. కాంట్రాక్టు హత్యలు, ముఠా గొడవలంటే మహా మక్కువ. ఇటువంటి ఎన్నో ఘాతుక నేరాల చరిత్ర కొండవీటి చేంతాడంత ఉంది. అటువంటి నీరజ్ బవానాను నాలుగున్నరేళ్ల క్రితం అంటే 2015 ఏప్రిల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నేరగాడుగా పేరుగాంచిన నీరజ్ అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉన్నాడు. ఇంత కాలం నుంచి తమ జైల్లోనే ఉంటున్నాడనే కనీస సానుభూతి కూడా చూపడం లేదు తీహార్ జైలు అధికారులు. నీరజ్ ఏవో కోరికలు కోరాడట. అవి తీర్చడం మా వల్ల కాదంటారేమిటండీ ఈ జైలు అధికారులు. అతను ఏం అడిగాడనేగా మీ సందేహం.
మరీ గొంతెమ్మ కోరికలు ఏమీ కావు లెండి. జైల్లో ఒంటరిగా ఉండడం వల్ల తనకు కాలక్షేపం కావడం లేదట. అంతేకాదు మాంసం ముక్క లేనిదే సారుకు ఒక్క బుక్క కూడా గొంతులోకి దిగదట. అందువల్ల తనకు ఈ తోటకూర, తొక్కా, పప్పూ, చారు వంటి పదార్థాలు పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. జైల్లో చిప్ప కూడు తినడం వల్ల బరువు కూడా తగ్గిపోతున్నాడట. అందువల్ల తనకు ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు ఐపాడ్, ఎఫ్ఎం రేడియో వంటి సదుపాయాల కోసం కూడా పట్టుబడుతున్నాడు. తాను ప్రశాంతంగా ఉండడానికి, కాలక్షేపం కోసం ఆయా సౌకర్యాలను వెంటనే ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులకు కోర్టు ద్వారా వినతి పత్రం కూడా సమర్పించాడు.కానీ తీహార్ జైలు అధికారులు మాత్రం కనికరించడం లేదు.
జైలు నిబంధనలకు ఇది విరుద్ధమని, తాము ఇందుకు అనుమతించే ప్రసక్తే లేదని తీహార్ జైల్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. తీహార్ జైల్లో శాకాహారం మాత్రమే అందిస్తామని, జైల్లో ఇప్పటికే ఉన్నటువంటి రేడియోలో నీరజ్ సంగీతం వినవచ్చని కూడా పేర్కొన్నారు. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తీహార్ జైల్లో సుమారు 1,700 మంది ఖైదీలు ఉన్నారట. వీరిలో నీరజ్ తోపాటు అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, రాజకీయ నేతగా మారిన గ్యాంగ్ స్టర్ మొహమ్మద్ షహబుద్దీన్ తదితరులు కూడా ఉన్నారట. వీళ్లెవరికీ అవసరం లేని వసతులు నీరజ్ బవానాకు మాత్రమే కావాలట. తనకు టీవీ, ఫోన్ కావాలని నీరజ్ ఇంతకు ముందు కూడా డిమాండ్ చేశాడట. అయినా తీహార్ జైలు అధికారులు కనికరించడం లేదు. నీరజ్ కు ఇవన్నీ సమకూరిస్తే ఇక జైలు దేనికి? ఇల్లే బెటర్ కదా? అంటున్నారట. ఈ ఢిల్లీ నేరగాడి వింత కోరికలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.