ముందు ఇక్కడ గల వీడియోను తీక్షణంగా చూడండి. ఇది ఖమ్మం నగరంలోని పాత బస్ స్టేషన్. కానీ అక్కడ క్యూలో నిల్చున్నవారు మాత్రం ఆర్టీసీ ప్రయాణీకులు కాదు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం లైన్లో నిల్చున్న ప్రజలు. రెండు వైపులా క్యూ చేంతాడులా ఎలా ఉందో చూశారుగా? గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఇది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఖమ్మం నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రతకు ఈ వీడియోలోని దృశ్యం అద్దం పడుతోంది. పోలింగ్ ముగిశాక కరోనా వ్యాప్తికి సంబంధించిన పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పడానికి పాత బస్ స్టేషన్ లోని క్యూ లైన్లే నిదర్శనమని పలువురు అభివర్ణిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న వరంగల్ మహానగరం, సిద్ధిపేట, నకిరేకల్ తదితర మున్సిపాలిటీల్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకమే. ఇక ఈ వీడియో సంగతిని ఇక్కడితో వదిలేస్తే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మినీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి తెలంగాణా హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. అవేమిటో దిగువన చూద్దాం.
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణాలో నిర్వహిస్తున్న మినీ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎలా వెళ్లారని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని హైకోర్టు నిలదీసింది. యుద్ధం వచ్చినా, ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇదే దశలో కొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం ఉంది కదా? అని హైకోర్టు ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించినట్టు ఎస్ఈసీ అధికారులు తెలిపారు. కాగా కరోనా సెకండ్ వేవ్ మొదలైనా ఎన్నికలకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనాన్ని వ్యక్తంచేసింది. అధికారులు కరోనా కట్టడిని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందని, ఎస్ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, అధికారులు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థతులపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహార తీరుపై ఆయా వ్యాఖ్యలు చేసింది.