గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 150 డివిజన్లకుగాను ఇప్పటి వరకు 149 డివిజన్ల ఫలితాలపై దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ వార్త రాసే సమయానికి అధికార టీఆర్ఎస్ పార్టీ 50 డివిజన్లలో ఆధిక్యత సాధించగా, మరో ఐదు డివిజన్లలో తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. అదేవిధంగా బీజేపీ 44 డివిజన్లలో గెలుపొంది, మరో ఆరు డివిజన్లలో లీడ్ లో ఉంది. ఎంఐఎం పార్టీ 41 స్థానాల్లో విజయం సాధించి, మరో డివిజన్ లో ఆధిక్యతలో ఉంది.

ఆధిక్యత సీట్లను కూడా ఆయా పార్టీలకు లభించిన సీట్ల సంఖ్యలో పరిగణిస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకనే పరిస్థితులు కనిపించడం లేదు. ఎక్స్ అఫీషియో ఓట్లు సహా గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి మేజిక్ ఫిగర్ 102 కు చేరుకోవాలి. కానీ టీఆర్ఎస్ పార్టీకి 55 స్థానాలు ఖరారైతే (ఆధిక్యత సంఖ్యలో మార్పు రాకుంటే మాత్రమే) మరో 47 ఓట్ల కావాలి. ఆ పార్టీకి గల ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య 38 మాత్రమే. అంటే మొత్తం టీఆర్ఎస్ బలం 93 మాత్రమే. ఈ ప్రాతిపదికన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మరో తొమ్మిది మంది సభ్యుల బలం కావాలి.

ఎంఐఎం పార్టీ తమకు మిత్రపక్షం కాదని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి ఎంఐఎం మద్ధతు ఖచ్చితంగా టీఆర్ఎస్ కు అవసరం. కానీ మరికొద్ది నెలల్లోనే వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం మద్ధతును అధికార పార్టీ స్వీకరిస్తే, దాని ప్రభావం ఆయా కార్పొరేషన్ ఎన్నికలపై పడుతుందనే వాదన టీఆర్ఎస్ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఈ అంశాన్ని బీజేపీ మరింత బలంగా వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో వాడుకుంటుందనే భయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దరిమిలా ఈ విషయంలో టీఆర్ఎస్ ఏం చేయబోతున్నది? ఇదీ రాజకీయంగా చర్చకు ఆస్కారం కలిగిస్తున్న అసలు ప్రశ్న.

Comments are closed.

Exit mobile version