మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

ఒక మంత్రి మీద అనామకుడు ఉత్తరం రాస్తే, వెంటనే స్పందించి, ఏం జరిగిందో తెలుసుకోకుండా బర్తరఫ్ చేయడం, రాత్రికి రాత్రే ఎంక్వయిరీ చేసి నా వివరణ కూడా తీసుకోకుండా చర్య తీసుకున్నారు.

నీళ్లు లేని కా బొండిగ కోయమని, ప్రాణం ఉండగానే బొందపెట్టాలని ఆదేశాలు ఇస్తే.. ఎన్నెన్ని డబ్బులు ఆశ చూపుతున్నారో… అనేక బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేసినపుడు తట్టుకుని నిలబడ్డరు మావాళ్లు. కొందరు తట్టుకోలేకపోయారు.

హుజురాబాద్ ప్రజలు నాకు హామీ ఇచ్చారు. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటమని చెప్పిండ్లు. ప్రజల చేత శభాష్ అనిపించుకున్నాను.

బంగారు పల్లెంలో పెట్టి ఈటెల రాజేందర్ కు ఏవేవో చేశామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా. నాకు పదవి ఇవ్వలేదని నేను మాట్లాడలేదు. నాకు ఏ పదవి ఇచ్చినా సంపూర్ణంగా శక్తి వంచన లేకుండా ఉద్యమానికి న్యాయం చేశాను.

ఇజ్జత్ తక్కు బతుకు బతుకకు బిడ్డా అని ప్రజలు అంటున్నారు. బతికి చెడొద్దు బిడ్డా అని ప్రజలు ఆశీర్వదించారు. పందొమ్మిదేళ్ల పార్టీ అనుబంధానికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.

కేసీఆర్ డబ్బును, కుట్రను, అణచివేతను నమ్మకున్నాడు. తెలంగాణా సమాజం తప్పకుండా ఎదురొడ్డి నిలుస్తుంది. తెలంగాణా ప్రజలు ఆకలినైనా భరిస్తారు తప్ప… ఆత్మగౌరవాన్ని కోల్పోరు.

గ్యాప్ ఎందుకొచ్చిందని చాలా మంది అడుగుతున్నారు. ఇది ఈరోజు రాలేదు. అయిదేళ్ల క్రితమే వచ్చింది. హరీష్ రావుకు కూడా గ్యాప్ వచ్చింది. తనకు వచ్చిన ఆదేశాల మేరకు హరీష్ ఈరోజు పనిచేస్తుండవచ్చు.

ముఖ్యమంత్రయినా, ఉద్యమ నాయకుడైనా మేం ‘అన్న’గానే కేసీఆర్ ను అనుకున్నం. తొమ్మది మంది ఎమ్మెల్యేలతో నేను వెడితే గేటు బయటే ఆపారు. కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వలేదు. రెండోసారి ఆపాయింట్మెంట్ తీసుకున్నాం.

తనకు గోళీలు ఇవ్వడానికి మనిషి కావాలే. ఆ మనిషి సంతోష్ రావు కావాలే. గోళీలు ఇచ్చే రాజ్యసభ సభ్యున్ని అడిగాను. ప్రగతి భవన్ కాదు… బానిస నిలయం అని పేరు పెట్టుకో అని చెప్పాను.

రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావద్దని అనేక అవమానాలను దిగమింగుకున్నాం. ఆత్మగౌరవం లేని, బాధ్యత లేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా.

సీఎంవో ఆఫీసులో ఒక్క ఐఏఎస్ ఆఫీసరైనా ఉన్నాడా? సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా? సీఎంవో ఆఫీసు అంటే రాష్ట్రానికి ఓ భరోసా. ఇట్ల చెప్పుకుంటపోతే చాలా ఉన్నయ్.

ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో మీటింగ్ అయితది. అర్థిక మంత్రి ఉండడు. మంత్రులను ఉద్యోగ సంఘాలు సమస్యలపై కలిస్తే ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నిస్తుండేవాళ్లు. దరఖాస్తు తీసుకుంటే హేళన చేశారు.

ఇందిరా పార్కు దగ్గర ఎన్ని టెంట్లు వేసి ఉద్యమాలు చేశామో? ఆంధ్రా సంఘాలను విడగొట్టి అనేక సంఘాలను ఏర్పాటు చేశాం. బొగ్గుగని కార్మిక సంఘలా వంటి సంస్థలు అటువంటివే.

కల్వకుంట్ల కవితకు బొగ్గుగని కార్మికులతో సంబంధాలు ఉంటాయా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి లేడా? సంఘాన్ని పెట్టిన అశ్వత్థామరెడ్డితో రాజీనామా చేయించారు.

తెలంగాణా గడ్డ మీద సంఘాలు, సమ్మెలు ఉండొద్దని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మెచేసి బిచ్చమెత్తుకుని, కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. రక్షించాలని ప్రాథేమపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇవ్వాళ అన్ని సంఘాలకు హక్కుల్లేవ్. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేసిన చరిత్ర వీళ్లదే. ఇవన్నీ మేం అడగకూడదా?

నేడు మనం చేస్తున్న పని సమైక్య పాలకులు చేస్తే తెలంగాణా రాష్ట్ర వచ్చేదా? ఓసారి ఆలోచన చేయాలని నేను కోరుతున్నా.

సంక్షేమ పథకాలను నేనే వ్యతిరేకించలేదు. రైతుబంధును వందల కోట్ల రూపాయల ఆదాయపు పన్ను కట్టేవాళ్లకు ఇవ్వడాన్ని వ్యతిరేకించాను. పేద రైతులకు మాత్రమే ఇవ్వాలని చెప్పాను. దున్నని భూములకు, కంచెలకు రైతుబంధు అవసరమా? భూమి లేని వాళ్లు సీరియస్ గా ఫీలవుతారని చెప్పాను. తప్పా?

రెండేళ్లుగా బియ్యం కార్డుల్లేవ్. ఇప్పిస్తానని చెప్పాను తప్పా? గ్రామాలు బాగుపడకుండా బంగారు తెలంగాణా సాధ్యం కాదని చెప్పాను. ఐకేపీ సెంటర్లు ఉంటయ్. వడ్లు కొంటయ్… అని చెప్పిన. తప్పా ఏమన్నా? ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లా?

వీడు చాలా విషయాల మీద అడుగుతున్నడు. కుక్కిన పేనులాగా ఉండలేడని అనుకున్నరు. రేషంగల బిడ్డను కాబట్టే నయీం బెదిరించినా భయపడలేదు. మంత్రి పదవి ఇచ్చి బానిస లెక్క బతకమంటే బతుకుతనా? సాధ్యమైతదా? మీకంటే ఉన్నతంగా ఉండాలని కోరుకోలేదు. నేనిచ్చిన స్టేట్ మెంట్ హరీష్ కూడా ఇచ్చారు.

లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలిత, మాయావతి లాగా ఏర్పాటు చేసిన కుటుంబ పార్టీ కాదిది. లక్షలాది మంది ఉద్యమించి, వందలాది మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లారు,. బయటి వాళ్లు ఇంట్లోకి వచ్చారు. నీ పక్కన ఉన్నవాళ్లు ఒక్కో వ్యక్తి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు.

నీ భాషలో చెప్పాలంటే గజకర్ణ… గోకర్ణ… టక్కు టమాల విద్యలతో నన్ను తెలంగాణా ప్రజల నుంచి వేరు చేసే ప్రయత్నం చేశావ్? ఉన్న ఆస్తులన్నీ అమ్మకో… కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దని నా భార్య చెప్పింది.

మస్కా కొడితే నాకు పదవి ఇవ్వలేదు. ఒళ్లు వంచి, కొట్లాడితే వచ్చిన హక్కు ఇది. ఆలె నరేంద్రను, విజయశాంతిని, కోదండరామ్ ను పంపించారు. ధర్మం ఉంటది. న్యాయం ఉంటది? చట్టం ఉంటది.

నీకు తెల్వాల్సింది… రాచరికం పద్ధతుల్లో నువ్వు రాలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రివైనవ్. ఈ ఎమ్మెల్యేలెందుకు? మంత్రులెందుకు? ప్రజలను నాకే నేరుగా ఓట్లు వేస్తే బాగుండునని నువ్వు అనుకుంటవ్. మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు. స్వతంత్రంగా ఉండలేదు.

నేను కేబినెట్ లో ఉండే సీక్రెట్స్ చెప్పడం లేదు. జేసీ దివాకర్ రెడ్డి వంటి సీమాంధ్ర నాయకులు కోట్ల ఆశ చూపిండ్లు. ఉద్యమాన్ని వదిలేస్తరా? అని అడిగిండ్లు. మేం ప్రలోభాలకు గురి కాలేదు.

స్వేచ్ఛగా, స్వతంత్రంగా మీటింగులు పెట్టుకునే పరిస్థితులు లేవు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మీ వద్దకు వచ్చి పనులు అడిగే ఆస్కారం ఉందా? మేం కాంగ్రెస్ మంత్రుల వద్దకు కూడా వెళ్లి ప్రజలకు అవసరమైన పనులు చేయించినం.

పదిహేడు మంది మంత్రుల మీద నీకు నమ్మకం లేకపోతే… నాలుగు కోట్ల మంది ప్రజలపై నమ్మకముంటుందా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవలసిన అవసరముందా? ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమిది. గొడ్డలిపెట్టు లాంటిది.

ఆర్ఎస్ఎస్ తోపాటు ఆర్ఎస్ యూ కూడా ఉద్యమం చేసింది. బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని చెప్పలేదా? నేను బాసినసను కాదు. నేనొక ఉద్యమ సహచరున్ని.

ఆత్మాభిమానంమీద, ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టే పని చేశావ్. చెల్లదుగాక చెల్లదు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తా.

Comments are closed.

Exit mobile version