మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నీ కేసులకు, అరెస్టులకు భయపడే ప్రస్తక్తే లేదని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. నయీం వంటి హంతక ముఠాకే తాను భయపడలేదన్నారు. మహా అయితే ఆస్తులు గుంజుకుంటవ్? ఇంకేం చేస్తవ్? అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ ఇంకా ఏమన్నారో అతని మాటల్లోనే…
‘‘ఈటెల రాజేందర్ అనే మామూలు మనిషి మీద తనశక్తిని, వివిధ రకాల ప్రభుత్వ శాఖలను పురమాయించారు. చర్చోపచర్చలు పెట్టి, ఇటువంటి రాతలకు, ప్రచారానికి ఒడిగట్టడం కేసీఆర్ గౌరవాన్ని, స్థాయిని పెంచదు. నీతో అడుగలో అడుగు వేసిన తర్వాత ఏనాడైనా సింగిల్ పైసా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు లభించలేదు, చేయలేదు. నా కుమారుడు చదువుకుని వచ్చాక రూ. 100 కోట్ల రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించాం. మీకు మీరే ఎంక్వయిరీ చేసి, విచారణ చేసుకుంటే…? విచారణ సందర్భంగా నోటీసులు ఇస్తరు. నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి, అధికారం ఉందని ఏదిపడితే అది చేసే పద్దతి ఎవరూ చేయరు. అసలు నా పేరు ఎట్ల పెడుతవ్? జమునా హేచరీస్ కు నేను చైర్మెన్ కాదు. నా భార్య, నా కొడుకు, నా కోడలు సంస్థ అది. నా భార్యను నితిన్ రెడ్డి భార్యగా నివేదికలో రాశారు. నీ అధికారులకు వాయి, వరుస కూడా లేదు. నీకూ కొడుకున్నలురు, బిడ్డలున్నరు, వాయి వరుసలు తెలుసు. హైటెక్ సిటీ, బంజారాహిల్స్ భూములు కావవి. 5.35 ఎకరాల్లో పౌల్ట్రీ ఫాం కడుతున్న. నా వివరణ కూడా అడగలేదు. కలెక్టర్ నివేదిక అధికారికంగా అందలేదు. నిన్నటి నుంచి నా ఇంటిచుట్టూ వందల మంది పోలీసులను పెట్టి, ఏ క్షణమైనా ఈటెల రాజేందర్ ను అరెస్ట్ చేయవచ్చట అనే ప్రచారం చేస్తున్నారు మీ శిష్యరికంలో ప్రజలను, చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. తప్పకుండా కోర్టుకు వెడతా. కొన్ని వేల సంఘటనల్లో… నీకు నిజాయితీ, నిష్పక్షపాత భావన ఉంటే…. మీరు కూడా వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉన్నారు. ఎన్నెన్నో గ్రామాల మీదుగా రోడ్డు వేశారు. అందులో అసైన్డ్ భూములు లేవా? అయినా నేను అనడం లేదు. సర్పంచ్ ను ప్రలోభపెట్టి మాట మార్చి మట్లాడించారు. వ్యక్తులు ఉంటరు, పోతరు. వ్యవస్థలు, ప్రజలు శాశ్వతం. మహిళా సాధికారత కోసం తెలంగాణా గడ్డమీద మీరు ఎన్నెన్ని రాయితీలు ఇచ్చారో…? నేను కూడా ఆ కమిటీలో ఉన్నా. పౌల్ట్రీ వ్యవసాయం కింద వస్తది. నాలా కన్వర్షన్ అక్కరలేదు. నీకు తగునా? ఇదేనా సంప్రదాయం? నీ అరెస్టులకు, నీ కేసులకు భయపడే చిన్నవాడేం కాదు ఈటెల రాజేందర్. నయాంలాంటి హంతకముఠాకే భయపడలేదు. చంపడానికి కూడా రెక్కీ నిర్వహించారు. ఎప్పుడన్నా చెప్పుకున్ననా? ఇంట్లో కూడా చెప్పుకోలేదు. కమిట్మెంట్, ధైర్యం ఉన్నది కాబట్టే పోరాడుతున్నాను. నమస్తే తెలంగాణా పేపర్ లోన్ కోసం నా పౌల్ట్రీ ఫాంను కుదువబెట్టాను. అధికారంలోకి వచ్చాక, కుదుటపడ్డాక రుణం చెల్లించారు. ఆత్మ ఉంటది… అంతరాత్మ ఉంటది. అంతరాత్మ ప్రకారం నడుచుకోవాలి. నేను రుషిని కాదు శపించడానికి. సివిల్ సప్లయిస్ మంత్రిగా చేశాను. నా మీద మీరు రేపు ఆరోపణలు చేస్తరు. ఈటెల రాజేందర్ అనెటోడు ప్రేమకు లొంగుతుండె. కేసులు పెడ్తే, జైలుకు పంపితే పోత. నేను ఏ స్థాయి నుంచి వచ్చానో అదే స్థాయికి వెళ్లడానికి కూడా సిద్ధం. కానీ నేను నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోలేను. పధ్నాలుగేళ్లపాటు ఉద్యమంలో నీతోపాటు ఉన్నాను. ఒక్కసారే నేను దయ్యంలాంటోడిని ఎట్ల అయిన? పార్టీ పెడతా అని చెప్పలే? పార్టీ మారుతా అని చెప్పలే? నువ్విచ్చే బీ ఫారమే అంతిమం కాదు. నువ్వు బీ ఫారం ఇచ్చినోళ్లు అందరూ గెల్వలే. రాజీనామా చేయమంటే తప్పకుండా చెయ్యలె? రాజీనామా చేసే ముందు 20 ఏళ్లుగా నన్ను ఎత్తుకుని, ప్రేమించిన నా నియోజకవర్గ ప్రజలను అడిగి నిర్ణయం తీసుకుంట. ఈటెల రాజేందర్ పదవుల కోసం పెదవులు ముయ్యడు. మీ శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగాను. ఇది వాస్తవం. రాష్ట్రం వస్తది, ఎమ్మెల్యేలు అయితం. మంత్రులు అయితమని మీ దగ్గరికి రాలే. అమ్ముడుపోని క్యారెక్టర్ ఉన్నవాళ్లం కాబట్టే మీతో ఉన్నం. మిమ్మల్ని మేం కాపలా కాసుకున్నం. మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటయ్ ముఖ్యమంత్రి గారూ? కర్కశత్వం, కారుణ్యం రెండు ఉంటయి నాణేనికి. ఉక్కుపాదం మోపుతున్నపుడు మీకు, నాకు ఉన్న అనుబంధాలు గుర్తుకు రావాలె కదా? ఏం న్యాయమిది? ఏం అరెస్ట్ చేస్తవ్ నన్ను? ఎన్ని రోజులు జైల్లో పెడతవ్? మొత్తం నా అస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఇవ్వాళ నేను ఒక్కన్నే కావచ్చు. కానీ నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య. నీ మంత్రి పదవి కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం. మేం ఎందుకు దూరమయ్యామో మీ అంతరాత్మకు తెలుసు. మంత్రులుగా చూడకున్నా ఫరవాలేదు. మనుషులుగా చూస్తే చాలు. మీ దగ్గర ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా, గౌరవంగా ఉన్నట్లు భావించడం లేదు. చట్టాన్ని, సిస్టంను పక్కనబెట్టి మీరెలా వ్యవహరిస్తారో నాకు తెలుసు. చావునైనా భరిస్తాను తప్ప, ఆత్మగౌరవాన్ని కోల్పోను. చెమటచుక్కలతో సంపాదించుకున్న ఆస్తిని గుంజుకుంట్ కావొచ్చు. అంతకన్నా ఏం చేస్తవ్?’’ అని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కాగా చేతులెత్తి దండం పెడుతున్నానని, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని ప్రజలకు దండం పెట్టి చెబుతున్నానని ఆయన కోరారు.