ఖమ్మం మున్సిపల్ మాజీ కార్పొరేటర్ ఒకరు పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తున్న ఘటన తీవ్ర కలకం రేపుతోంది. అయితే ఈ మాజీ ప్రజాప్రతినిధి స్టేషన్ నుంచి తప్పించుకున్న ఉదంతంపై భిన్న కథనాలు వినిపిస్తుండడమే అసలు విశేషం. వివరాల్లోకి వెడితే…

ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ కు చెందిన మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ నేత జంగం భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అక్రమ కేసు బనాయించారని, అతని ఆచూకీ చెప్పాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వర్గీయులు గురువారం అర్ధరాత్రి దాటే వరకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గానికి చెందిన మేకల ఉదయ్ అనే వ్యక్తిని జంగం భాస్కర్ ఫోన్ చేసి దుర్భాషలాడి, బెదిరించాడనే ఫిర్యాదు పోలీసులకు అందింది. ఈ ఘటన అనంతరం గురువారం సాయంత్రం తుమ్మల వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. జంగం భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశానికి తరలించారని, అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో జంగం భాస్కర్ ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాకపోవడం గమనార్హం. గురువారం ఉదయమే జంగం భాస్కర్ ను పోలీసులు అతని ఇంటి నుంచి తీసుకువెళ్లారని తుమ్మల వర్గీయులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసు వర్గాల కథనం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.

మాజీ మంత్రి తుమ్మలతో జంగం భాస్కర్ (ఫైల్ ఫొటో)

తమకు అందిన ఫిర్యాదు మేరకు జంగం భాస్కర్ పై కేసు నమోదు చేశామని, అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, నిందితున్ని తామే అప్పగిస్తామంటూ తుమ్మల వర్గీయుల భాస్కర్ ను స్టేషన్ కు తీసుకువచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై మాట్లాడుతామని, కాసేపు వెయిట్ చేయాలని తాము స్టేషన్ కు వచ్చినవారితో చెప్పామంటున్నారు.

ఈ దశలోనే అకస్మాత్తుగా తుమ్మల అనుచరగణం ఆందోళనకు దిగిందని, తాము నమోదు చేసిన కేసులో నిందితుడైన భాస్కర్ ను స్టేషన్ కు తీసుకువచ్చినవారే, తమ కళ్లుగప్పి, చాకచక్యంగా తప్పించారనేది పోలీసు వర్గాల కథనం. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇటు పోలీసుల, అటు తుమ్మల వర్గీయుల కథనాలు భిన్నంగా ఉన్నప్పటికీ, మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ పోలీస్ స్టేషన్ నుంచే పరారీ అయ్యాడనే అంశం తీవ్ర సంచలనానికి దారి తీసింది.

ఇదిలా ఉండగా గురువారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఆందోళన పర్వంలో తుమ్మల వర్గానికి చెందిన దాదాపు 40 మంది టీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులను దుర్భాషలాడారని తదితర అభియోగాలపై ఐపీసీ 353, 149, 341 వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Comments are closed.

Exit mobile version