సమస్యపై ఆందోళనలు జరుగుతున్నప్పుడు, మంచి వార్తో, చేదు వార్తో విన్నప్పుడు గుండె ఆగిపోతుంది. ఈ రైతు మరణం అయితే గుండె ఆగిపోవడంతోనే. ఈ విషయంలో ఏ పార్టీకీ భిన్నాభిప్రాయం ఉన్నట్టు కనిపించలేదు. అయితే గుండె ఆగిపోవడానికి కారణాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది రాజకీయం. రైతు మృతికి సంతాపం, రైతు కుటుంబానికి సానుభూతి తెలియజేయాలి. అది కనీస ధర్మం. మనిషి పట్ల గౌరవం లేకపోయినా పర్లేదు, మృత్యువు పట్ల గౌరవం ఉండాలి.
వ్యవస్థాపకత (entrepreneurship) :
ఇక్కడో విషయం చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ రైతులు ఔత్సాహికులు. రైతులే కాదు, ప్రజలంతా ఔత్సాహికులే. చేతులు కట్టుకొని అచేతనంగా ఉండరు. ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అమరావతి ప్రాంతంలో భూములకు ధరలు పెరిగి వాటిని అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు వారు పల్నాడు ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లా దర్శి, మార్కాపురం ప్రాంతంలోనూ భూములు కొన్నారు. అప్పట్లో ఈ వార్తను నేను ప్రముఖంగా రాశాను. దొండపాడు నుండి ఉండవల్లి వరకూ అన్ని గ్రామాలు తిరిగి, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, వంటివారితోనే కాకుండా, మేకలు, గొర్రెలు పెంచుకునే యాదవ సోదరులతో, పంటపొలాల్లో తాటిచెట్ల కల్లు గీసే గీత కార్మికులతో, పంటపొలాల్లో విద్యుత్ మోటార్లు రిపేర్ చేసే వారితో… ఇలా చాలా రకాల ప్రజా సమూహాలతో మాట్లాడిన అనుభవం ఉంది.
అమరావతి గ్రామాల్లో రెండు ఎకరాలకు మించి ఉన్న అనేకమంది రైతులు పల్నాడు, ప్రకాశం జిల్లాలలో భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సిద్ధం అయ్యారు. నీటికొరత కారణంగా ఉద్యాన పంటలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడానికి ముందే అనేక మంది రైతులు ఆంధ్ర ప్రాంతంలో రెండు, మూడు ఎకరాలు అమ్ముకొని తెలంగాణ ప్రాంతంలో పది, ఇరవై ఎకరాలు కొనుగోలు చేసి వ్యవసాయాన్ని మొదలు పెట్టి ఇప్పటికి అక్కడే స్థిరపడిన విషయం మనం మర్చిపోకూడదు.
ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు తమ పంట భూములు విక్రయించాల్సి వస్తే మరో చోట భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేసే ప్రయత్నమే చేస్తారు. కొద్దిమంది మాత్రమే గుఱ్ఱాలు, కొంటారు. బెంజి కార్లు కొంటారు. ఇంట్లో లిఫ్ట్ పెట్టుకుంటారు. రైతు చూపు ఎప్పుడూ భూమి పైనే ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు దశాబ్దాల క్రితమే ఇక్కడ చిన్న కమతాలు అమ్మేసుకుని తెలంగాణాలో పలు ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ ఎకరాల చొప్పున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాలు నడుపుతున్నారు. తెలంగాణాలో అనేక ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు పేర్లతోను, రైతుల (కమ్మ) పల్లెలుగా అనేకం ఉన్నాయి.
“నా ఐదేళ్ళు మట్టిలోకి వెళ్ళకపోతే నీ ఐదేళ్ళు నోట్లోకి ఎలా వెళ్తాయి?” అని తుళ్ళూరు – దొండపాడు మధ్య పత్తి చేలో ఉన్న రైతు చెప్పిన మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను.
వ్యవసాయం చేసే రైతు పొద్దున్నే మట్టివాసన చూడందే ముద్దకూడా ముట్టడు. పశువులతో, పంటలతో కాపురం చేసే లక్షణం రైతుది. అలాంటి రైతు అమరావతి కారణంగా భూముల ధరలు పెరిగి ఆ భూములు రాజధానికోసం ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు ఎక్కడో భూమి కొనుగోలు చేసే ఉంటాడు. కేవలం భూమి మాత్రమే ఉండి దాన్ని కౌలుకిచ్చి “పట్నవాసానికి అలవాటుపడ్డ రైతు” మాత్రమే ఇప్పుడు ఆందోళన చెందుతున్నాడు.
పట్నవాసం రైతు :
చాలా మంది రైతులు ఈ గ్రామాల్లో తమ భూములను కౌలుకు ఇచ్చి పిల్లల చదువుకోసమో, మెరుగైన వైద్య సదుపాయాలకోసమో, లేక పిల్లల ఉద్యోగ రీత్యానో, వేరే వ్యాపారం చేద్దామనో పట్నానికి వచ్చేశారు. అపార్టుమెంటు జీవితానికి అలవాటు పడ్డారు. పేడ తీయడం, పాలు పితకడం, పొలంలో సాలు దున్నడం, పంటకు నీళ్ళు మళ్ళించడం, పచ్చగడ్డి మోపు కట్టడం… ఇలాంటివన్నీ ఎప్పుడో మర్చిపోయారు. గ్రామంలో కౌలుకిచ్చిన భూమినే రాజధానికి ఇచ్చారు. ఎకరం ఐదులక్షల భూమి ఏకంగా ఐదు కోట్లు అయింది. అనుకున్న ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లు ప్రభుత్వం ఇచ్చి ఉంటే, అనుకున్న ప్రకారం అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అయి ఉంటే ఆ ప్లాటు మరో రెండుమూడు కోట్లు విలువ చేసేది. హైదరాబాద్ బంజారా హిల్స్ భూముల ధరలు ఇలాగే పెరిగాయి. అనేక అపార్టుమెంట్లలో ఇలా పల్లెటూరులో వ్యవసాయాన్ని వదిలేసి వచ్చిన రైతులు అనేక మంది ఉన్నారు.
ఎంత పట్నవాసానికి అలవాటు పడ్డా అప్పుడప్పుడు వెళ్ళి తమ భూములు చూసుకుంటారు. మహిళలకు బంగారం (నగలు) ఎంత ఇష్టమో రైతులకు భూములు అంటే అంత ఇష్టం ఉంటుంది.
బ్రతికి ఉంటే అన్నం పెట్టేది భూమే… బ్రతుకు చాలిస్తే అక్కున చేర్చుకునేది కూడా ఆ భూమే. అందుకే రైతుకి పంట భూమి, పశుసంపదతో విడదీయరాని బంధం ఉంటుంది. పట్నవాసానికి అలవాటు పడ్డ రైతు కూడా పంటను చూసినా, పశువును చూసినా కళ్ళు మెరవడం, వళ్ళు పులకరించడం అనుభవించగలడు. రైతును జీవితాన్ని, రైతు బతుకును లాఠీలు, బూటుకాళ్ళతో అవమానించకండి. అంతకు మించిన అవమానం మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
తెగిన బంధాలు:
గ్రామాల్లో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు… ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడే జీవిస్తారు. ఆ జీవనం అలాగే ఉంటుంది. గ్రామంలో జీవితం గొలుసు కట్టు. ఒక్క లింకు తెగినా ఇబ్బందే. రైతు ఇంట్లో శుభకార్యం అంటే రైతు కూలీలందరూ వచ్చి పనిచేసి వెళ్తారు. రైతు కూలీ ఇంట్లో శుభకార్యం అంటే రైతు ఆర్ధిక సహాయం అందిస్తాడు. ఇదో విడదీయరాని, వీడిపోని బంధం. అలాంటిది గడచిన మూడు, నాలుగు దశాబ్దాల్లో గొలుసు కట్టులో అన్ని లింకులు తెగిపోయాయి. రైతులకు కౌలు రైతులతో “కౌలు డబ్బుల” లింకు వచ్చింది. రైతులు, కౌలు రైతులకు రైతు కూలీలతో “కూలి డబ్బుల” లింకు వచ్చింది. ఈ లింకు గ్రామంలో ఇళ్ళ మధ్య దూరం అలాగే ఉన్నా వ్యక్తుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు రైతు ఇంట్లో శుభకార్యానికి ఉచితంగా పనిచేసే రైతు కూలీ లేడు. రైతు కూలీ ఇంట్లో శుభకార్యానికి ఆర్ధిక సహాయం చేసే రైతు లేడు. గ్రామాల్లో వెల్లివిరిసిన బంధాలను “డబ్బు”, “రాజకీయం” విధ్వంసం చేశాయి. రాజకీయం (అధికారం) రైతు కూలీపై లాఠీ ఎత్తితే రైతు మాట్లాడడు. రైతుపై లాఠీ ఎత్తితే రైతు కూలీ మాట్లాడడు. గత రెండు, మూడు దశాబ్దాలుగా నేను చూస్తున్నది ఇదే. బంధాలు తెంచేసుకుని భిన్న ధృవాలుగా పక్కపక్కనే పట్టించుకోని అంటీ ముట్టని జీవితం గడిపేస్తున్నాం.
అమరావతిలో స్పష్టంగా కనిపించే దృశ్యాలు ఇవే. గత పాలకుల హయాంలో కౌలు రైతులు, రైతు కూలీలు టార్గెట్ అయ్యారు. రైతులు మౌనంగా ఉన్నారు. ఈ పాలకుల హయాంలో రైతులు టార్గెట్ అయ్యారు. కౌలు రైతులు, రైతు కూలీలు మౌనంగా ఉన్నారు. (కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. అవి మినహాయింపులే).
– దారా గోపి, జర్నలిస్ట్, విజయవాడ