దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఓ ఎన్కౌంటర్ ఘటన తెలంగాణా రాష్ట్ర పోలీసులను చుట్టుకుంది. ‘దిశ’ కేసు నిందితుల ఎన్కౌంటర్ కు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు జస్టిస్ సర్పూర్కర్ కమిషన్ సిఫారసు చేసింది. పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ పేర్కొంది. మొత్తం 387 పేజీల నివేదికను సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించింది
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని, పోలీసులు కట్టుకథలు చెప్పారని జస్టిస్ సర్పూర్కర్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని కూడా పేర్కొంది. ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి పలువురు పోలీసులను విచారించాలని కూడా కమిషన్ సిఫారసు చేసింది.
పోలీసు అధికారులు వి. సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, రవి, సిరాజుద్దీన్, వెంకటేశ్వర్లు, అరవిందగౌడ్, జానకీరామ్, బాలూ రాథోడ్, శ్రీకాంత్ లు ఎన్కౌంటర్ కు పాల్పడినట్లు కమిషన్ పేర్కొంది. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారించాలని సిఫారసు చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని, ఇదీ మూకదాడి వంటిదేనని కమిషన్ వ్యాఖ్యానించింది. ఈ కేసులో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ మొత్తం 16 సిఫారసులను చేయడం విశేషం.
ఫొటో: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ నాటి దృశ్యం (ఫైల్ పొటో)