దళితబంధు పథకంలో ఇకనుంచి టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యత దక్కనుందా? అనే ప్రశ్నకు సమాధానం ఔననే విధంగా అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దళితబంధు పథకంలో టీఆర్ఎస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యతనిస్తామని, ఆ తర్వాతే మిగతా వారికి అవకాశం ఇస్తామని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
నియోజకవర్గంలోని ఖానాపురంలో టీఆర్ఎస్ ముఖ్యనేతల, కార్యకర్తల సమావేశంలో నిన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపికపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ముందుగా అర్హులైన టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణాలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలని, అందుకోసం పాటుపడుతున్న అర్హులైన తమ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను ముందుగా అందేవిధంగా చూస్తామని ఎమ్మెల్యే నిర్వచించారు. అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు అన్యాపదేశంగా చేసినవి కావని, పార్టీ అధిష్టానం ఆదేశం మేరకే ఆయన ఇలా అన్నారని తెలుస్తోంది.
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు తరుముకొస్తున్నవేళ… దళిత బంధు పథకంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతనిస్తారనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నాయకత్వం ఆదేశించినట్లు సమాాచారం. తద్వారా ఇతర పార్టీల్లోని దళితులను అధికార పార్టీలోకి ఆకర్షించినట్లవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు మళ్లించినట్లవుతుందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నర్సంపేట ఎమ్మెల్యే దళితబంధు పథకంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పలువురు దళితులు టీఆర్ఎస్ లో చేరడం గమనార్హం.