‘‘నాకేమైంది? మంచిగనే ఉన్నా కదా! ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా.. దుక్కలా ఉన్నానని ఇదివరకే అసెంబ్లీ వేదికగా చెప్పాను కదా! అయినా మీకు క్లారిటీ రాకపోతే ఎట్లా? నేను నచ్చలేదా మీకు? ముఖ్యమంత్రి పదవికి నేను పనికిరానా? నేను మంచిగా పనిచేయడం లేదా? నన్ను సీఎంగా వద్దని అనుకుంటున్నారా చెప్పండి? ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.. అనవసరంగా ప్రజలను, పార్టీ శ్రేణులను ఎందుకు కన్ప్యూజ్ చేస్తున్నారు?’’
‘‘టీఆర్ఎస్ పార్టీకి ఒక విధానం, నిర్మాణం ఉన్నాయి. ఒకవేళ మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటే, నేను కేంద్రానికి వెళ్లాలి, నా అవసరం అక్కడ ఉందని అనుకుంటే, మీ అందరినీ పిలుస్తా.. మాట్లాడుతా. అందరి అభిప్రాయాలతోనే ఏకగ్రీవంగా మార్పు చేస్తా. అనవసర రాద్ధాంతం, అక్కరలేని విషయాలు ఎందుకు? ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పదవులు ఊడుతాయ్’’
‘‘అయినా ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పేరు ముందు సీఎం పదవి ఓ లెక్కనా? అది నా ఎడమ కాలి చెప్పుతో సమానం. సీఎం పదవి లేకపోయినా.. తెలంగాణ తెచ్చినందుకు గాంధీ ఫొటో పక్కన నా ఫొటో పెట్టి పూజలు చేసేవాళ్లు. ఇప్పుడు పదవిలో ఉన్నోడు.. లేనోడు ఏది పడితే అది మాట్లాడుతున్నడు. ఇన్ని అవమానాలు, బాధలు భరించాల్సిన అక్కర నాకేం ఉంది ? తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దని, రాష్ట్రాన్ని ఎవరికో అప్పగిస్తే అది ఎటో పోతుందని, అనుకున్నది చేస్తరో చేయరోనని.. బాగు చేద్దామని సీఎం పదవిలో కూర్చున్న. తప్పుడు కామెంట్లు చేసేటోణ్ని ఎవరినీ వదిలిపెట్టేది లేదు’’
‘‘నేను మొదటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే సుప్రీం అని చెబుతున్నా. మంత్రులు, ఇతరులు ఎవరూ అక్కడ వేలు పెట్టొద్దు. కానీ, దీనిని అలుసుగా తీసుకొని కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే అలాంటి వాళ్లను పీకి పారేస్తా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే, మళ్లీ వాళ్లకు పార్టీ టికెట్లు వస్తాయి. చెప్పినట్టు వినకపోతే పక్కకు తప్పించడం ఖాయం’’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఇకపై ఎవరైనా లూజ్ టాక్ చేస్తే బండకేసి కొట్టి.. పార్టీ నుంచి బయటకు పారేస్తా…’’
నిన్నటి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా కథనాల్లోని ముఖ్యాంశాలివి. పద ప్రయోగంలో కాస్త అటూ, ఇటూగా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయేమోగాని, మొత్తంగా ‘కంటెంట్’ మాత్రం ఇంతే. గమనించాల్సిన విషయమేమిటంటే నిన్నటి టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగిన తెలంగాణా భవన్ లోకి మీడియాను అనుమతించలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇక్కడ ఈ తరహా సమావేశాలు జరిగినా మీడియాను లోనికి అనుమతించరనే ప్రచారం ఉండనే ఉంది. అందుకే కాబోలు కొన్ని ప్రధాన పత్రికలు కూడా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ‘ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం…’ అని మాత్రమే తమ కథనాల్లో నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమావేశం ముగిశాక, అందులో పాల్గొన్న నాయకులు బయటకు వచ్చాక మాత్రమే కేసీఆర్ గర్జనకు సంబంధించిన వ్యాఖ్యల సమాచారం బహిర్గతం కావడం గమనార్హం. సీఎం మార్పు ప్రచారంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో కోపగించుకున్నట్లు ఆయా వ్యాఖ్యల కథనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఏ మీడియాలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ‘విజువల్స్’ రాకపోవడం ఈ సందర్భంగా గమనార్హం.
విశ్వసనీయ సమాచారం ప్రకారమే… ఈ అంశంలో చెప్పదల్చుకున్న అసలు విషయమేమిటంటే…? పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలకన్నా తీవ్ర స్థాయిలోనే సీఎ కేసీఆర్ పలువురు నేతలపై మండిపడ్డారుట. సమావేశం ప్రారంభానికి ముందే అందులో పాల్గొనే నాయకులను కనీసం తమ సెల్ ఫోన్లను కూడా అనుమతించలేదట. రావలసిన వాళ్లు రాగానే సమావేశపు హాలు తలుపులు మూసి మరీ కేసీఆర్ గర్జించినట్లు సమాచారం. సీఎం మార్పుపై మాట్లాడిన ప్రతి మంత్రిని, ఎమ్మెల్యేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పేరు, పేరునా తలంటినట్లు తెలుస్తోంది. ‘బండకేసి కొడతా, పార్టీ నుంచి పీకేస్తా’ వంటి వ్యాఖ్యలు ఇందులో భాగంగానే అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ఈనాడు జరుగుతున్న కొత్త ప్రచారమేమీ కాదు. దాదాపు ఏడాదికిపైగా జరుగుతున్న ప్రచారమే. కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు 14 నెలలుగా ‘సీఎం కేటీఆర్’ అంటూ ఆలాపిస్తున్న ఉదంతాలపై అనేక వార్తా కథనాలు వచ్చాయి. మరికొందరు మంత్రులు అడ్వాన్స్ గ్రీటింగుల స్థాయిదాకా వెళ్లారు. నెలల తరబడి సాగుతున్న ఈ ప్రచారంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో గర్జించడం మాత్రం ఇదే తొలిసారి. నెలలుగా సాగుతున్న ఈ ప్రచారంపై సీఎం కేసీఆర్ ఇప్పుడే ఇంతగా ఆగ్రహించడానికి గల కారణాలేమిటి? ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనా? బీజేపీ దూకుడుకు లభిస్తున్న ప్రాచుర్యాన్ని నిలువరించే ఎత్తుగడా? లేక తన సీఎం పదవిపై పార్టీలో గల వ్యతిరేకుల సంఖ్యను లెక్కించుకునే వ్యూహమా? కేసీఆర్ అంచనాకు అనుగుణంగా ఇంకా చాలా మంది నాయకులు ఈ విషయంలో బహిర్గతం కాలేదా? కేటీఆర్ సీఎం అంటూ భజన చేసినవారి భవిష్యత్తుపై మున్ముందు ఏదేని ప్రభావం పడనుందా? కేటీఆర్ సీఎం అయితే తమకు పదవులు లభిస్తాయని ఆశపడిన నాయకుల పరిస్థితి ఏమిటి? ఆయా అనేక సంశయాలపైనే అధికార పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.