మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనదని, ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమి పైనే ఉంటుందని భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రవచించారు. గురువారం ఆయన మచిలీపట్నం గొడుగుపేట లోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయం జీర్ణోద్ధరణ గావించి నూతన దేవాలయ నిర్మాణంకు తన స్వహస్తాలతో భూమిపూజ , శంఖుస్థాపన, శిలాన్యాసం చేశారు.

రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సభాధ్యక్షులుగా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకులు చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ, ఈ రోజు తెల్లవారితే, వైకుంఠ ఏకాదశి అని ఆ సందర్భంగా మీ అందరికి ఆ వైకుంఠనాధుడు అనేక మేళ్లు కలుగచేయాలని కోరుకొంటున్నానని అందరినీ దీవించారు. ఇది ధనుర్మాసమని ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక అని అన్నారు. ఈ మాసంలో తొమ్మిదవ రోజు నేడు అని, ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసిందని చెబుతూ ఆండాళమ్మ వారి అనుగ్రహం మీ అందరిపైనా పుష్కలంగా ఉండాలని ప్రార్ధన చేస్తున్నట్లు తెలిపారు.

ఆమె ఒక లక్ష్యం మనందరిపైనా పెట్టారని దేవుడు సర్వాంత్యర్యామని అప్పుడప్పుడు అవతరిస్తాడని ఆ అవతరించిన సమయంలో ఏదో ఒక అవతారాన్ని ఆధారం చేసుకొని ఏర్పాటు చేసుకొన్న విగ్రహం ద్వారా మాత్రమే దైవాన్ని చూడాలని ఆండాళమ్మ వ్రత తాత్పర్యమన్నారు. ‘‘యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ ’’ పరమాత్మను ఏయే రూపంలో ఆరాధిస్తే ఆయా రూపంలోనే పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని చిన్న జీయర్ స్వామి ఉద్బోధించారు. తన ముందు ప్రసంగించిన మంత్రి పేర్ని నాని మాటలు ఎంతో అనుభవపూర్వకమైనవని ఒక అద్భుతమైన తల పండిన వేదాంతి మాదిరిగా ఆయన మాట్లాడరని చిన జీయర్ స్వామీ ప్రశంసించారు. పేర్ని నాని ఏ వేదం అభ్యసించారో తనకైతే తెలియదని చెబుతూ ” తాను కాదు చేసేది.. మనం కాదు చేసేది స్వామివారు అనుగ్రహిస్తే ఆయా పనులు వాటంతట అవే చక చకా జరుగుతాయని ” చెప్పే విశ్వాసం మంచి మనస్సు ఎంతో మహోన్నతమైనదన్నారు.

చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికలలో ఎన్నో వాగ్ధానాలు చేస్తారని అత్యధికులు పదివి నుంచి వైదొలిగిన తర్వాతే కానీ అవి జ్ఞప్తికి వస్తాయని అందుకు భిన్నంగా పేర్ని నాని తాను ఎన్నికలలో చేసిన హామీని జ్ఞాపకం పెట్టుకొని ఆ భగవంతుడు ఆయనకు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వగానే ఆ పని పూర్తి చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని ప్రశంసించారు. దేవుని సేవతోనే ఈ దఫా తన రాజకీయ జీవితం ప్రారంభించాలని తలంచి మచిలీపట్నం గొడుగుపేట లోని శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయంను పునర్నిర్మాణం చేయాలనీ సంకల్పించడం పట్ల తాను వందనాలు తెలియచేస్తున్నానని, మీ రాజకీయ జీవితంలో ప్రజలకు మరెన్నో మంచి పనులు చేసి శక్తీ భగవంతుడు మీకు ఇచ్చు గాక ! అంటూ చిన జీయర్ స్వామి సభాముఖంగా పేర్ని నానిను ఆశీర్వదించారు.

గతంలో ప్రతి కళ , విద్య , వైద్యం ఆలయమే కేంద్రంగా కొనసాగేదని చెబుతూ ఏ కులభేదం జాతిభేదం వర్ణభేదం వయోబేధం లేకుండా ఒకే చోట అందరూ చేరేది నాది మాది అనుకొనే చోటు ఆలయమని అన్నారు. ఆలయం బాగుంటే సమాజం బాగుటుందని చిన జీయర్ స్వామి వక్కాణించారు.

అలాగే, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతో ఉదార హృదయంతో దేవాదాయశాఖ కామన్ జనరల్ ఫండ్ నుండి 1 కోటి 80 లక్షలు రూపాయలు మంజూరు చేయడం, హైకోర్టు న్యాయవాది దివంగత నల్లంచక్రవర్తుల భక్తవత్సలం కుటుంబ సభ్యులు 7 లక్షల 20 వేల రూపాయలు, మారంగంటి శోభారాణి ఆమె స్నేహితులు 2 లక్షల 62 వేల రూపాయలు , మంత్రిపేర్ని నాని 1 లక్షరూపాయలతో పాటు పలువురు స్థానికులుస్వామివారికి కానుకగా ఇవ్వడంతో ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యద్భుతంగా నిర్మాణం జరుపుకోనుందని చిన జీయర్ స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వి. సత్యనారాయణ, డి ఇ ఈ బి. శ్రీనివాసరావు, మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ కె. శివరామకృష్ణ, దేవస్థాన కార్య నిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, ఘనాపాటి విష్ణుభట్ల సూర్య నారాయణ శర్మ, శ్రీకాకుళపు గుప్తా , గోపిశెట్టి సతీష్, ఐనంపూడి తాతారావు, ప్రధాన అర్చకులు లీలాకృష్ణ, కమిటీ సభ్యులు ఉడత్తు శ్రీనివాస్, నిమ్మగడ్డ సత్యప్రకాష్, కాండూరి పాండు, బొర్రా రాజా తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version