మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధావస్థను ఎదుర్కుంటున్నారా? ఈ సందిగ్థం నుంచి బయటపడే మార్గాన్వేషణలో అయోమయానికి గురవుతున్నారా? పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ఇటువంటి కీలక స్థితిని ఎదుర్కుంటుండడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ మాజీ సీఎంకు తాజా రాజ్యసభ ఎన్నికలు పార్టీపరంగా కొరకరాని సమస్యగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా గజకర్ణ, కోకర్ణ, టక్కుటమారాలు తెలిసిన నేతగా ప్రాచుర్యం పొందిన కేసీఆర్ ఎదుర్కుంటున్న ఆ సందిగ్ధం ఏమిటి? అందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ల పదవీ కాలం ఏప్రిల్ రెండో తేదీన ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఖాళీ అవుతున్న ఈ మూడు స్థానాలకు ఈనెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీకి కేవలం 39 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తవుతున్నప్పటికీ, ఇప్పుడు దక్కేది ఒక్క సీటు మాత్రమే. రాజ్యసభ సభ్యులుగా రిటైరవుతున్న సంతోష్, రవిచంద్ర, లింగయ్య యాదవ్ లలో మళ్లీ ఎవరికి అవకాశం లభిస్తుంది? ఈ విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ముగ్గురిలో ఎవరికి ప్రధాన్యతనిస్తారు? మళ్లీ ఎవరిని ఎంపిక చేస్తారు? ఇదీ అసలు ప్రశ్న.

నిజానికి తాజా ఎంపిక చర్చల్లో బడుగుల లింగయ్య యాదవ్ ఊసే పెద్దగా వినిపించడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ లు ఆరేళ్లపాటు పదవిని అనుభవించారు. వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం రెండేళ్లకు ముందుగానే ముగుస్తోంది. నిజానికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం దక్కనున్న ఒక్కసీటులో వద్దిరాజు రవిచంద్రనే కేసీఆర్ కూర్చోబెట్టాలి. కానీ అధికారం చేజారిన పరిణామాల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న మూడు సీట్లలో గులాబీ పార్టీకి దక్కేది సింగిల్ సీటు మాత్రమే. ఇప్పుడీ సీట్లో కేసీఆర్ ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు? బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న అంశమిది.

తన తోడల్లుడి కుమారుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ కుటుంబంలో ముఖ్య సభ్యుడిగానే పేరు తెచ్చుకున్నారు. అందువల్ల ఈ సింగిల్ సీటులో సంతోష్ ను కేసీఆర్ కూర్చోబెడితే విపక్షాల నుంచేగాక సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలను చవి చూడాల్సి ఉంటుందనేది కాదనలేని అంశం. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు తీవ్ర అన్యాయం చేసినట్లవుతుంది. ఈ పరిణామాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు ఇంచార్జిగా వ్యవహరించిన వద్దిరాజు రవిచంద్ర వల్ల పార్టీకి భారీ లబ్ధినే చేకూర్చారని చెప్పక తప్పదు. రవిచంద్ర ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంతగా కష్టపడినప్పటికీ, అక్కడి అభ్యర్థులపై గల తీవ్ర వ్యతిరేకతను అధిగమించడం రవిచంద్రకు సాధ్యపడలేదన్నది పార్టీ అధినేతకూ తెలిసిన విషయమే.

ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యునిగా వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం కల్పిస్తే ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారనే పేరును కేసీఆర్ సంపాదించుకుంటారు. ఇందుకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ నే మరోసారి ఎంపిక చేస్తే కుటుంబ ప్రయోజనాన్ని మాత్రమే కేసీఆర్ కాంక్షించారనే విమర్శలను ఎదుర్కోకతప్పని స్థితి. ఇంతకీ కుటుంబ సభ్యుడైన సంతోష్ కుమారా? పార్టీ కోసం బట్టలు చించుకున్న బీసీ నేత వద్దిరాజు రవిచంద్రనా? పరివారమా? సామాజిక న్యాయమా? ఎవరిని కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిగా మళ్లీ ఎంపిక చేస్తారు? ఏ అంశానికి కేసీఆర్ ప్రాధాన్యతనిస్తారు? ఈ సందిగ్థావస్థను బీఆర్ఎస్ చీఫ్ ఎలా అధిగమిస్తారు? నామినేషన్ల దాఖలుకు ఈనెల 15వ తేదీ చివరి గడువు. ఈలోగానే కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కుంటున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఫైనల్ గా కేసీఆర్ ప్రాధాన్యత కుటుంబానికా? సామాజిక న్యాయానికా? అనే అంశం తేలాలంటే మరో రెండు రోజుల వరకు వేచి చూడాల్సిందే.

Comments are closed.

Exit mobile version