ముక్కు నుంచి మొదలై కళ్లకు పాకుతుంది. కంటి కండరాలు పని చేయకుండాపోయి చూపును కోల్పోయే ప్రమాదం. అక్కడి నుంచి మెదడువాపు వ్యాధిగా మారి ప్రాణాన్ని కూడా కబలించే ప్రమాదకర పరిస్థితి. గతంలో జైగోమైకోసిస్ గా వ్యవహరించిన అరుదైన ఈ ఫంగస్ ఇప్పుడు గుజరాత్ లో వెలుగు చూసింది. మ్యూకోర్మైసెటీస్ అనే శిలీంధ్రం వల్ల సోకుతుందని భావిస్తున్న ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే అహ్మదాబాద్ లో తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. మరో 35 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

‘బ్లాక్ ఫంగస్’గానూ వ్యవహరిస్తున్న ఈ వ్యాధికి సంబంధించి రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కూడా 12 కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ముంబయి, అహ్మదాబాద్ నగరాల్లో ఈ ప్రాణాంతక వ్యాధిపై ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజలు అతలాకుతమవుతున్న పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా హెచ్చరించారు.

ఫీచర్డ్ ఇమేజ్: ప్రతీకాత్మక దృశ్యం

Comments are closed.

Exit mobile version