వరంగల్ మహానగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగడమే ఇందుకు ప్రధాన కారణం. అయోధ్య రామాలయం నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై తొలుత బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే నివాసంపై రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేయగా, ఇంటి అద్దాలు, ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో బీజేపీకి చెందిన పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన అనంతరం హన్మకొండలోని బీజేపీ అర్బన్ జిల్లా కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు చెందిన కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యాలయంపై దాడిచేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు నిరసన దీక్షకు దిగారు.

కాగా దాడి ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని, తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని, రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు బీజేపీ పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదని కేటీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Comments are closed.

Exit mobile version