పత్రికలు ప్రజల పక్షాల నిలవాలి. జర్నలిజం జనహితాన్ని కోరాలి. పత్రికల యాజమాన్యాల పాలసీ ఏదైనా కావచ్చు.., ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రత్యేక కథనాలు వండి వార్చాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ జరిగిన కార్యక్రమాన్ని వార్త రూపంలో యథావిధిగా తన పాఠకులకు నివేదించడం పత్రికల కనీస కర్తవ్యమని సీనియర్ జర్నలిస్టులు పదే పదే చెబుతుంటారు. జర్నలిజంలో కాకలు తీరిన సీనియర్ ఎడిటర్లు కూడా ఇదే విషయాన్ని నిర్దేశిస్తుంటారు. పత్రికా విలువల్లో కనీస ధర్మం పాటించకుండా వ్యవహరించినట్లు విమర్శలు ఎదుర్కుంటే మాత్రం ఆ పత్రికలో పనిచేస్తున్న సిబ్బందికి పోయేదేమీ లేకపోవచ్చు. కానీ అంతిమంగా పత్రికకు నష్టం జరుగుతుంది. పాఠకుల ముందు నవ్వులపాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇంతకీ విషయమేమిటంటే… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఖమ్మం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో బీజేపీ శ్రేణులు భారీ సందడి చేశాయి. కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు బీజేపీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సమాయత్తమవుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల జోష్ లో గల బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఖమ్మంలోనూ కాస్త చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తోందనేది అందరికీ తెలిసందే. ఈ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ తదితర నేతలు ఖమ్మంలో పర్యటించారు.

‘సాక్షి’ కథనపు ఇండికేషన్

ఈ సందర్భంగా ‘ఇంటలెక్చువల్ మీట్’ తోపాటు మీడియా సమావేశం తదితర కార్యక్రమాల్లో బీజేపీ అగ్రనేతలు సందడి చేశారు. సీఎం కేసీఆర్ పైనా, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పైనా ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ యుద్ధంలో ఆరోపణలు, విమర్శలు సహజమే కావచ్చు. ఇందులో ఎవరి ప్రయత్నం వారిదే. ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది వేరే ప్రశ్న. కానీ అసలు ఆ నాయకుడి పర్యటన ఎలా సాగింది? ఆయన చెప్పిన ప్రధానాంశాలేమిటి? అనే విషయాలపై తన పాఠకులకు నివేదించాల్సిన బాధ్యత పత్రికలది. కానీ ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించిన కవరేజీ విషయంలో ఇవ్వాల్సిన కనీస ప్రాధాన్యతను ఇవ్వడంలో ‘సాక్షి’ ఎందుకు వెనుకంజ వేసిందనేది అసలు ప్రశ్న. సంజయ్ పర్యటనకు సంబంధించి మెయిన్ ఎడిషన్ లో ఎక్కడా సింగిల్ కాలమ్ వార్త కనిపించలేదు. ఇక జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజీలో మాత్రం దిగువన కుడివైపున, ఓ మూలన సింగిల్ కాలమ్ ఇండికేషన్ ఇచ్చి నాలుగో పేజీలో వార్త ఉందంటూ ముక్తాయించారు.

సరే… అది వైఎస్ఆర్ సీపీకి చెందిన నాయకుడి పత్రిక. కానీ ఏపీలో జగన్ సర్కార్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలే ఉన్నాయి కదా? మరి బండి సంజయ్ ఖమ్మం పర్యటనకు సంబంధించి ‘సాక్షి’ పత్రిక అంటీ ముట్టనట్లుగా, కంటితుడుపు చర్య చందంగా కవరేజి ఎందుకు ఇచ్చినట్లు? ఇది సాక్షి పెద్దల ఆదేశం మేరకే జరిగిందా? లేక స్థానికంగా నిర్ణయం తీసుకున్నారా? స్థానికంగా నిర్ణయం తీసుకుంటే ఎవరి ప్రాపకం కోసం… మరెవరి మెహర్బానీ కోసం ఇలా వ్యవహరించినట్లు? ఇవీ బీజేపీ శ్రేణుల సందేహాలు. మా పత్రిక, మా ఇష్టం అని సాక్షి పెద్దలు భావింవచ్చు. కానీ మీడియా స్థితి గతంలో మాదిరిగా లేదనే విషయం ఈ సందర్భంగా గమనార్హం. ‘మేం కూయకుంటే తెల్లారదు’ అనే పరిణామాలు ప్రస్తుతం మీడియాలో లేవని, ఈ విషయాన్ని గుర్తించకపోతే పాఠకుల్లో నవ్వుల పాలయ్యేది సంబంధిత పత్రిక మాత్రమేనని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు అసలు సంజయ్ మాట్లాడిందేమిటో? ఆ పత్రికలో వచ్చిన వార్త ఏమిటో? తెలుగులోనే మాట్లాడిన సంజయ్ పర్యటన వార్తా కథనం తలాతోకా లేనివిధంగా సాగడం గమనించాల్సిన మరో అంశం.

ప్రజాపక్షం పత్రిక వార్తా కథనం

ఏమాటకామాట… కాషాయం పార్టీ ఉనికిని సైతం నిలదీసే పక్కా కమ్యూనిస్టు పత్రిక ‘ప్రజాపక్షం’ బీజేపీకి మంచి కవరేజీ ఇచ్చింది. అది అనుకూలమా? వ్యతిరేకమా? అనేది మాత్రం ప్రశ్నే కాదు. బండి సంజయ్ పర్యటన తీరు తెన్నులపై ప్రత్యేక కథనాన్ని కూడా ఇవ్వడమే అసలు విశేషం.

Comments are closed.

Exit mobile version