ఖమ్మం బీజేపీ కార్యకర్తల్లో ఎనలేని ఆత్మస్థయిర్యాన్ని నింపే దృశ్యమిది. తప్పొప్పుల తర్కం సంగత వదిలేస్తే, కష్టాల కడలిని ఈదుతున్న వారికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కల్పించిన భరోసా ఘటనగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సంజయ్ నిన్న ఖమ్మంలో పర్యటించిన సంగతి తెలిసిందే. పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న సంజయ్ నేరుగా ఏలూరి శ్రీనివాసరావు అనే ప్రభుత్వ అధికారి నివాసానికి వెళ్లారు. ఏలూరి కుటుంబానికి తాను అండగా ఉన్నానని చెప్పకనే చెప్పారు.
ఇంతకీ ఏలూరి శ్రీనివాసరావు ఎవరంటే… ప్రభుత్వ అధికార వర్గాల్లో, ముఖ్యంగా ఎన్జీవో, టీఎన్జీవో కార్యకలాపాల గురించి తెలిసినవారికి పెద్దగా పరిచయం అక్కరలేని ఎంపీడీవో. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు, ఆరోపణలు, వివరణలు, విచారణలు, కేసులు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఇటీవలి కాలంలో అనేక చిక్కులను చవి చూస్తున్న అధికారి. ఖమ్మం జిల్లా అశ్వాపురం నుంచి నేరుగా నారాయణపేట జిల్లాకు బదిలీ అయ్యారంటే స్థానికంగా ఏలూరి శ్రీనివాసరావు ఎదుర్కుంటున్న పరిణామాలను, పరిస్థితులను అవగతం చేసుకోవచ్చు.
ఈ ‘రాజకీయ’ వివాదంలో తప్పొప్పుల తర్కాన్ని కాసేపు పక్కనబెడితే, ఇటీవలే ఆయన బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకుగాను ఏలూరి సంజయ్ ను కలిసి అభినందించారు. ఈ ఘటనానంతరం ప్రభుత్వం వెంటనే ఏలూరిని సస్పెండ్ చేసింది. అయితే శుక్రవారం ఖమ్మం పర్యటనకు వచ్చిన బండి సంజయ్ తన పార్టీ కార్యక్రమాలు ముగించుకుని నేరుగా ఏలూరి నివాసానికి వెళ్లారు. ఏలూరి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఏలూరి శ్రీనివాసరావు మీద ఈగ వాలితే తాను హైదరాబాద్ నుంచి గంటల్లోనే ఖమ్మంలో వాలుతానని సంజయ్ ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఏలూరి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని కూడా చెప్పారు. ఈ దృశ్యం సహజంగానే బీజేపీ శ్రేణులకు ధైర్యం కలిగించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీతో నేరుగా సంబంధం లేకపోయినా ఏలూరి కుటుంబానికి సంజయ్ బాసటగా నిలిచారని, పార్టీ కేడర్ కు ఇది ఎంతో ధైర్యాన్నిచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు.