మూడు రాజధానులు కాదు, ముప్పై రాజధానులు అభివృద్ధి చేసినా కాదనే వారెవరు? దానికోసం చట్టం ఎందుకు? విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా రాజధాని లేదు. ఇప్పటికీ హైదరాబాదే ఉమ్మడి రాజధాని. అందువల్ల మూడు రాజధానుల కోసం చట్టం పెట్టాల్సిన పని లేదు.
మూడు రాజధానుల విషయంలో వివాదం నడుస్తోంది. ప్రతిపక్షం గట్టిగా పనిచేస్తోంది. రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులు ఉద్యమం చేస్తున్నారు. ప్రతిపక్షానికి, ఉద్యమం చేస్తున్న రైతులకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రతిదీ బూతద్దంలో చూపించి పతాక శీర్షికల్లో ప్రచారం చేస్తోంది. ఫలితంగా వివాదం రగులుతోంది. అమరావతిలో ఏదో జరుగుతోందనే భావన ఇతర ప్రాంతాల ప్రజలకు కలుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి చట్టం తేవాల్సిన పనిలేదు.
ఒక వేళ చట్టం కావాలి అనుకుని, ఆ చట్టాన్ని శాసనసభలో గెలిపించుకున్నా, శాసనమండలిలో గెలిపించుకోలేం అనే స్పృహ లేకపోవడం ఏంటి? శాసనమండలి అడ్డం తిరిగితే ఏం చేయాలనే ప్రత్యామ్నాయ ప్రణాళిక ముందస్తుగా లేకపోవడం ఏంటి?
ఇప్పుడు శాసనమండలి అడ్డం తిరగ్గానే మండలినే రద్దుచేస్తాం అనే ఆలోచనేంటి? మండలిపై ఖర్చు వృధా అని ఇప్పుడు అనడం ఏంటి?
‘ఫ్లోర్ మానేజ్మెంటు’ తెలియకపోవడం ఎవరి తప్పు? ఫిరాయింపుల అవసరమేముంది? బేర సారాలతో పనేంటి? రాజ్యసభలో బీజేపీ ‘ఫ్లోర్ మానేజ్మెంటు’ చేయడం లేదా?! అయినా ఓ ఏడాదిన్నర ఆగితే మండలి ప్రభుత్వ ఆధిక్యంలోకి వస్తుంది కదా!?
ఇప్పుడు మండలి రద్దు చేసి పార్లమెంటు అనుమతికోసం ఢిల్లీ చుట్టూ ఆరేడు నెలలు తిరగడం కంటే, ఇక్కడే ఇంకో మూడునెలలు ఆగొచ్చు. ప్రతిష్టకు, పట్టుదలకు పోవాల్సిన అవసరం ఏముంది?
ప్రతిపక్ష వ్యూహం పసిగట్టడంలో మీ నిఘా విభాగం వైఫల్యం చెందిందా? ప్రతిపక్ష వ్యూహాన్ని తిప్పికొట్టడంలో మీ న్యాయశాఖ సరిగా పనిచేస్తోందా? మీ ‘ఫ్రంట్ ఆఫీస్’, ‘బ్యాక్ ఆఫీస్’ సరిగానే పనిచేస్తున్నాయా?
ప్రభుత్వానికి కళ్ళు, చెవులుగా ఉండాల్సిన విభాగాలు సక్రమంగానే పనిచేస్తున్నాయా? ఒకవేళ ప్రభుత్వమే కళ్ళు, చెవులూ మూసేసుకుందా? కళ్ళు, చెవులుగా పనిచేసే అధికారులు, విభాగాలు సక్రమంగా పనిచేస్తే, లేదా కళ్ళు, చెవులకు పని చెబితే, ఇప్పుడు మండలిని రద్దు చేసి అభాసుపాలు కావలసిన పనిలేదు.
తాను చెప్పిన చట్టాన్ని ఎదిరించినందుకే ప్రభుత్వం మండలి రద్దు చేసింది అనే అపవాదు మూటకట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి చర్య ఇప్పుడు ప్రజలు ఇచ్చిన ఈ భారీ విజయాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది.
ప్రతిపక్షం వేసిన మొదటి ఎత్తుకే బెంబేలెత్తి ఏకంగా మండలినే రద్దుచేయడం అంటే అర్ధం ఏమిటి? మండలి రద్దు చేస్తే ప్రజలిచ్చిన 151 మంది సభ్యుల భారీ విజయానికి అర్ధం ఏమిటి?
మండలిలోని 58 మందికి భయపడతారనుకుంటే ఈ పార్టీకి 151 మందిని ప్రజలు ఇచ్చేవాళ్ళే కాదేమో!
-దారా గోపి @fb