పార్టీలను నడిపే నాయకులకైనా, ప్రభుత్వాలను నడిపే ముఖ్యమంత్రులకైనా తాము అనుసరించే మార్గాలపై ఆత్మవిశ్వాసం ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తాము నమ్మిన సిద్ధాంతానికి, నడిచే దారికి కట్టుబడి పయనించడం కూడా రాజకీయాల్లో ప్రధానమని నిర్వచిస్తుంటారు. అప్పుడే పార్టీ నడిపే నాయకుడిపై, ప్రభుత్వాలను నిర్వహించే పాలకులపై ప్రజలకు మరింత విశ్వాసం, భరోసా ఏర్పడుతుందన్నది సాధారణ అభిప్రాయం.
ప్రభుత్వ పథకాల తీరు తెన్నులపై, అనుసరిస్తున్న విధానాలపై, వాటి నడవడికలపై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తుంటాయి. ఇందులో ఏ అనుమానం అవసరం లేదు. తమ పథకాల లక్ష్యం ఏమిటో? నిర్ణయాల ఉద్ధేశం ఏమిటో? వాటిని ఎందుకు అమలు చేస్తున్నామో? ఇందుకు అనుసరిస్తున్న మార్గాలేమిటో నిర్వచించి, ప్రజలకు వివరించి, బాహాటంగా సమర్థించుకునే దమ్ము పాలక పక్ష రాజకీయ నేతల్లో ఉండాలి. అప్పుడే అది పథకమైనా, నిర్ణయమైనా, విధానమైనా ఆయా నాయకున్ని ప్రజల్లో చిరస్మరణీయున్ని చేస్తుంది. ఇటువంటి అంశాల్లో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ విశ్వాసం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో మరోసారి చర్చకు వస్తుండడమే అసలు విశేషం.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గురించి ఉమ్మడి రాష్ట్రంలోని విపక్షాలు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితులు అవి. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలో పేదల కోసం భారీ ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గురించి వైఎస్ అప్పట్లో ఏమన్నారంటే..
‘గుండె సంబంధిత వంటి డబ్బు ఖర్చయ్యే జబ్బు పేదవాడికి వస్తే… ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే ఆర్థిక శక్తి ఆ పేదవాడికి ఉండదు. అందుకే పేదవాడి గుండె ఆగిపోరాదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించాం. పేదవాడు ధైర్యంగా ఖరీదైన ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకోవడం కోసం, కార్పొరేట్ ఆసుపత్రుల కోసమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాహాటంగానే అంగీకరిస్తూ పథకం అసలు లక్ష్యాన్ని నిర్వచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ తరహా వైద్య సేవలు లేవని కూడా ఆయన పేర్కొన్నారు.అమరావతి రాజధాని ‘మూడు ముక్కల’ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అనుసరిస్తున్నట్లు పేర్కొన్న ఓ రహ‘దారి’ గురించి చదివాక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంభించిన ఆత్మవిశ్వాపు వైఖరుల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ పథకాన్ని గుర్తు చేసుకోవలసి వచ్చింది.
ఇక అసలు విషయంలోకి వస్తే.. ఏపీ అసెంబ్లీకి చేరుకునే ఎమ్మెల్యేలు, ఇతరుల కోసం కొన్నేళ్లుగా వినియోగంలో లేని దారికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారట. రాజధాని తరలింపు ప్రకటన అనంతర పరిణామాల దృష్ట్యా ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డును మళ్లీ వాడుకలోకి తీసుకువచ్చేందుకు రిపేర్లు చేస్తున్నారన్నది వార్తా కథనాల సారాంశం. మందడం, వెలగపూడి ప్రాంతాల్లో ‘పరిస్థితుల తీవ్రత’ కారణంగా కృష్ణాయపాలెం చెరువు నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు వీలుగా గతంలో ఏర్పాటు చేసిన రోడ్డులో మళ్లీ పయనించేందుకు అత్యవసర రిపేర్లు చేస్తున్నారుట. ఈనెల 20న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారగణం కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డును కాకుండా కృష్ణాయపాలెం చెరువు దగ్గర నుంచి వచ్చే రోడ్డుకు మళ్లిస్తారుట.
అమరావతి రాజధాని అంశంలో జగన్ సర్కార్ విజన్ ఎలా ఉన్నప్పటికీ, రాజకీయ పరిస్థితుల, పరిణామాల కారణంగా అసెంబ్లీకి వెళ్లేందుకు ఈ తరహా ప్రత్యామ్నాయ ‘దారి’ సరైనదేనా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు, ఉద్యమకారుల నుంచి వచ్చే నిరసనల తీవ్రతకు నిత్యం పయనించే దారిని మళ్లించడం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అనుసరించిన రాజకీయ, పరిపాలనా దక్షత ‘దారి’కి విరుద్ధమనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లే దారి కోసం హడావిడిగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని రిపేర్లు చేస్తున్నారంటే ‘మూడు ముక్కల రాజధాని’ ప్రకటన ఎక్కడో..ఏదో తేడా కొడుతున్నట్లేనా…! ఇదే ప్రస్తుత డౌటు!!