మా లాంటి చిన్న‌వాళ్లు చెబితే వినే స్థాయిలో టీఆర్ఎస్ ఉందో లేదో తెలియ‌దు కానీ.. తాజా ఎన్నిక‌ల‌ ఫ‌లితాల అనంతరం టీఆర్ఎస్ మేల్కోవాలి. ముఖ్యంగా ఉత్త‌రాదిలో బీజేపీకి బ‌ల‌మైన ఎదురుగాలి వీచే అవ‌కాశం ఉంది. జ‌మిలీ ఎన్నిక‌లంటూ కొత్త ఎత్తుగ‌డ వేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాదిలో కొన్ని రాష్ట్రాల‌లో పాగా వేయాల‌న్న ల‌క్ష్యంతో వాళ్లు ముందుకు సాగుతున్నారు. ఇక ఉద్య‌మం, తెలంగాణ వాదం, ఆంధ్రా అన్న మాట‌ల‌కు కాలం చెల్లిన‌ట్లే ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు నిరూపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా దూర‌మ‌వుతున్న ఉద్యోగ వ‌ర్గాన్ని (ఉద్యోగ సంఘం నేత‌ల‌ను కాదు), ఉద్య‌మ‌కారుల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకోవాలి. లేక‌పోతే మొన్న‌టి దాకా వ‌ల‌స ప‌క్షుల్లా వ‌చ్చిన ఇత‌ర పార్టీల నేత‌లు బీజేపీ వైపున‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు.

ఉత్త‌ర తెలంగాణ కోసం కాళేశ్వరం నిర్మించారు స‌రే, ద‌క్షిణ తెలంగాణ రైతాంగం కోసం భారీ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. రేప‌టి రోజున జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.

నిరుద్యోగుల తీవ్ర నిరాశ‌లో కొట్టుమిట్టాడుతున్నారు. మీరిచ్చే రైతుబంధు, పింఛ‌న్ల‌తో 60 ల‌క్ష‌ల‌కు పైగా ల‌బ్ధి పొందుతున్నార‌ని మీరు ధీమాగా ఉండొచ్చు.. కానీ ఒక్క చిన్న విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు. ఎదిగొచ్చిన కొడుకు నిరుద్యోగిగా ఉంటూ తాము పింఛ‌న్లు తీసుకోవ‌డం ఏ త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చుతుంది. రైతుబంధు వ‌స్తుంద‌ని, కొడుకుని ఉద్యోగ ప్ర‌య‌త్నం ఆపేసి రైతు కూలీగా మార‌మ‌ని ఏ త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హిస్తారు. వీరంతా కూడా పింఛ‌న‌ర్లు, రైతుల ఇంట్లోని వారే. కాబ‌ట్టి వీరంతా ఓటు వేసే వారిని ప్ర‌భావితం చేస్తారు.

ప్రైవేటు రంగంలో తెలంగాణ వాళ్ల‌కే 80 శాతం దక్కేలా ముందునుంచీ చూసి ఉంటే బాగుండేది. ఇక ముఖ్యంగా పార్టీ నాయ‌కులు కింది స్థాయిలో ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్న సంఘ‌ట‌న‌లు మీడియాలో వ‌చ్చిన వెంట‌నే వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం చేయాలి. క‌నీసం ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌క‌పోయినా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర దోచుకునే పార్టీ నాయ‌కుల వ‌ల్ల ఎక్కువ ముప్పు ఉంటుంది.

నోట్ : తెలంగాణ‌లో ఇంటి పార్టీ ఉండాలి. అలాగే త‌మిళ‌నాడు లాగా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష‌మైన మ‌రిన్ని ఇంటి పార్టీ లు కావాల‌ని కోరుకునే వాడిని త‌ప్ప‌… తెలంగాణ రాజ‌కీయాల్లో జాతీయ పార్టీలు పాగా వేయాల‌ని చూసే రోజువ‌స్తే అది మీ అస్తిత్వానికే కాదు తెలంగాణ స్వీయ అస్తిత్వానికీ ముప్పే.. అందుకే ప్ర‌త్యామ్నాయ పార్టీల‌ను ఎద‌గ‌నిస్తూ, రాష్ట్ర‌ అభివృద్ధి అజెండాగా ముందుకెళ్లండి.. 2023 మీదే అవ్వొచ్చు..

✍️ కరుణాకర్ దేశాయి కేతిరెడ్డి

Comments are closed.

Exit mobile version