‘దొంగ చేతికి తాళం చెవి’ చందం సామెతపై రకరకాల కథలు వ్యాప్తిలో ఉంటాయి. ఓ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కలిగినపుడు అతని చేతికే తాళం చెవి ఇచ్చి, సంబంధిత వ్యక్తి వ్యక్తిత్వాన్ని పరిశీలించాలన్నది ఆయా నానుడి తాత్పర్యం. కానీ ఈ సంఘటనలో మాత్రం దొంగ చేతికి తాళం చెవిని ఎవరూ ఇవ్వలేదు. తనకు తానే పోలీస్ స్టేషన్ పై రెక్కీ చేసినంత పనిచేశాడు ఈ దొంగ. ఓ రాత్రంగా స్టేషన్ ముందే మకాం వేసి పరిస్థితులను పరికించాడు. అదును చిక్కిందే తడవుగా ఠాణాలోకి దూరాడు. గోడకు తగిలించిన తాళం చెవిని చేజిక్కించుకున్నాడు. ఆయుధాగారంలోకి ప్రవేశించాడు. రెండు భారీ తుపాకులను ఎంచక్కా భుజానికి తగిలించుకుని వెళ్లిపోయాడు. ఇంత జరుగుతుంటే స్టేషన్ లోని పోలీసులు ఏం చేశారని మాత్రం అడక్కండి. పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారా? అని మరీ ఆశ్చర్యపోకండి. ఔను హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో దొంగ పడ్డాడు. రెండు భారీ తుపాకులను కూడా లూటీ చేశాడు. సంచలనం కలిగించిన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేట కాల్పుల ఉదంతంలో నిందితుడైన దేవుని సదానందం ఓ ఏకే-47, మరో కార్బన్ తుపాకులను ఎలా చోరీ చేశాడనే అంశంపై సిద్ధిపేట పోలీస్ అధికారులు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. తుపాకుల చోరీ ఉదంతానికి సంబంధించి ఆయా ప్రకటన వివరాలను ఉన్నది ఉన్నట్టుగానే దిగువన చదవండి. తుపాకుల చోరీ ఎలా జరిగిందనే విషయం మొత్తం అవగతమవుతుంది.
‘‘హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఆయుధాల కేసు Cr. No. 51/2018 U/s 409 IPC లో కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతుండగా తేది. 06-02-2020 రోజున అక్కన్నపేట మండల కేంద్రంలో రాత్రి 9:00 గంటలకు దేవుని సదానందం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన గుంటి గంగరాజు పై కాల్పులు జరిపి పారిపోయాడు, ఇట్టి విషయమై అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో తేదీ: 07-02-2020 కేసు నమోదు చేయనైనది. నిందితుని పట్టుకోవడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనైనది. నిందితుని గురించి గాలిస్తుండగా తేదీ: 07-02-2020 రోజున నిందితుడు సదానందం కోహెడ మండల కేంద్రంలో సంచరిస్తున్నట్లు సమాచారం రాగా, హుస్నాబాద్ ఎస్సై సుధాకర్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది.
తదనంతరం హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ నిందితుడిని వద్ద ఉన్న ఏకే 47 స్వాధీనం చేసుకుని విచారించగా, మరొక ఆయుధం కార్బైన్ తన ఇంటిలో ఉన్నదని తెలిపినాడు. విచారణ అధికారి సీఐ శ్రీనివాస్ తన బృందంతో వెళ్లి సదానందం ఇంట్లో నుండి కార్బైన్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తేదీ: 08-02-2020 నాడు అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. తదుపరి విచారణ కొరకు నిందితుల్ని పోలీస్ కస్టడీ గురించి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశానుసారం నిందితుల్ని తేదీ: 12-02-2020 నాడు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ అధికారి విచారించగా, నిందితుడు తన భార్య కేసు విషయంలో, తనకు గొట్టె కొముర్వతో ఉన్న అప్పు విషయంలో అప్పుడప్పుడు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల కదలికలను గమనించేవాడు. 2017 సంవత్సరంలో హోలీ పండుగ రోజు హుస్నాబాద్ కు వచ్చి పిఎస్ ముందు రాత్రి అంతా ఉండి తెల్లవారుజామున సుమారు సమయం 4 గంటలకు పిఎస్ లోనికి వచ్చి చూచినాడు. అప్పుడు మొదటి హాల్లో ఎవరూ లేనిది చూసి ఇదే సరైన సమయమని భావించి, గోడకు తగిలించి ఉన్న తాళం చెవిని తీసుకుని ఆయుధాల గదినుండి ఏకే 47, మరియు కార్బైన్ ఆయుధమును దొంగిలించుకుని వెళ్లినానని అంగీకరించినాడు. అట్టి ఆయుధాలతో తన ప్రత్యర్థులను భయపెట్టి తన సమస్యను పరిష్కరించుకోవాలి అనుకున్నాడు, అయితే నిందితునికి గొట్టె కొముర్వతో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో ఆయుధాలను తేదీ: 5/6-02-2020 వరకు ఎప్పుడూ ఉపయోగించలేదు. అక్కన్నపేట మండల కేంద్రంలోని గుంటి గంగరాజు, అశోక్ లతో చిన్న విషయమై గొడవ జరగగా, నిందితుడు తన వద్ద ఉన్న ఏకే 47 ఆయుధంతో రాత్రి కాల్పులు జరిపి పారిపోయినాడు.
తుపాకులకు అపహరణకు గురైన ఈ సంఘటనలో ఇంచార్జ్ సిపి ఎన్. శ్వేత ఐపీఎస్ ఎస్పీ కామారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశోధన అధికారి సిద్దిపేట ఏసిపి రామేశ్వర్, ఆరోజు విధినిర్వహణలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంపై అధికారిక నివేదిక ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది.’’
-పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.