లెక్క ప్రకారం సరిగ్గా మూడు రోజుల జాతర. దాదాపు కోటిన్నర మంది భక్తుల లెక్క. ఈ స్వల్ప వ్యవధిలోనే అక్కడ కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ మొత్తాన్ని అంచనా వేయడం ఈజీ కూడా కాదు. కానీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వారం రోజుల ‘ఈవెంట్’ లైసెన్స్ ద్వారా తెలంగాణా ప్రభుత్వం కూడా రూ. 4.00 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే మేడారం జాతరలో అసలు విశేషం. ఈ అంశమే ఇప్పుడు చర్చగా మారింది. నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుల చెల్లింపు, కోళ్లు, మేకల బలి, మద్యపాన సేవనం మేడారం జాతరలో భక్తుల ఆనవాయితీ. ఇక్కడ ఇవన్నీ ఓ కల్చర్ కూడా.
ఈ కల్చర్ ను టార్గెట్ గా చేసుకుని తెలంగాణా ఎక్సయిజ్ శాఖ కోట్ల రూపాయల మొత్తపు ఆదాయాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం. వారం రోజుల వ్యవధికి లిక్కర్ షాపుల లైసెన్సుల మంజూరు, మద్యం సరఫరా ద్వారా రూ. 4.00 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా ఎంచుకున్నట్లు సమాచారం. గత జాతరలో రూ. 3.00 కోట్ల ఆదాయం లభించగా, ఈసారి మరో కోటి అదనంగా నిర్దేశించుకున్నట్లు లిక్కర్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆదాయం మద్యం అమ్మకాలతోనే అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం నుండే గాక ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటకతో పాటు దేశ నలుమూలల నుండి కోటి మందికి పైగా భక్తులు రానున్న మేడారం సమ్మక్క సారమ్మ జాతరలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యం విక్రయాలు జరిపేందుకు ఆదివాసీలకు 22 ఈవెంట్ పర్మిట్లు (లైసెన్స్) లను ఎక్సయిజ్ శాఖ జారీ చేసింది. మేడారంతో పాటు పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెం, కన్నెపల్లి, నార్లాపూర్, కొత్తూర్, ఊరట్టం, వెంగళాపూర్, జంపన్న వాగు తదితర ప్రాంతాల్లో ఈ బ్రాందీ షాపులు ఏర్పాటు చేస్తారు. వారం రోజుల పాటు మాత్రమే అమలులో ఉండే ఈవెంట్ పర్మిట్లకు ఒక్కొక్క లైసెన్స్ పేరుతో రోజుకు రూ. 9 వేల ఫీజ్ చొప్పున ఎక్సయిజ్ శాఖ వసూలు చేస్తున్నది. లైసెన్స్ పొందిన వారికి విక్రయ స్థలాలను కేటాయించినందుకు ఏటూరునాగారం ఐటీడీఏ ఒక్కో షాపునకు రూ. 17 వేల మొత్తాన్ని వసూలు చేసి లైసెన్స్ జారీ చేస్తోంది.
సమ్మక్క జాతరలో 1998 వరకు మద్యం షాపుల అమ్మకం లైసెన్స్ లు బహిరంగ వేలం ద్వారా కేటాయించేవారు. కానీ జాతరలో బెల్లం (బంగారం), కొబ్బరికాయలు ఆదివాసీలే అమ్ముతున్నారని, మద్యం అమ్మకాల అవకాశం కూడా తమకే ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. దీంతో ఆదివాసీల అభ్యర్థన మేరకు 2000 సంవత్సరం జాతర నుండి ఆదివాసీలకే మద్యం షాపులు కేటాయిస్తున్నారు. ఆదివాసీ సంఘాలకు కేటాయించిన బెల్లం, కొబ్బరికాయ షాపులతో పాటు మద్యం షాపులను తమ అనుచరులకు పంపిణీ చేస్తుంటారు. అయితే ఆదివాసీలకు స్వతహాగా మద్యం వ్యాపారం చేసే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆదివాసీయేతరులు, గిరిజనేతరులు తెరవెనుక ఈ లిక్కర్ దందాను నిర్వహిస్తుంటారనేది ఎక్సైజ్ వర్గాలకు తెలియనిదేమీ కాదు. గుడ్ విల్ చెల్లించి ఆదివాసీయేతరులు లబ్ది పొందడం గత రెండు దశాబ్ధాలుగా ప్రతి జాతరలో జరుగుతూనే ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మద్యం లావాదేవీల్లో ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలు, పూజారుల సంఘం, ఐటీడీఏ, పోలీసు, ఎక్సయిజ్ శాఖ వారు లబ్ది పొందుతున్నట్లు ప్రచారం మాత్రమే ఉండగా, జాతరలో 20 ఏళ్లుగా మద్యం షాపుల నిర్వహణలో లాభాలు గడించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
ఇక అసలు విషయానికి వద్దాం. జాతర సందర్భంగా ప్రభుత్వానికి రూ. 4.00 కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. బ్రాందీ, విస్కీ, బీరు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే రేట్లు, ఆ మద్యాన్ని ప్రభుత్వం మద్యం వ్యాపారులకు విక్రయించే రేట్ల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే మతి పోవాలసిందే. ఉదాహరణకు ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ను 54 రూపాయలకు ప్రభుత్వానికి మద్యం తయారీ కంపెనీ సరఫరా చేస్తే, దాన్ని 461 రూపాయలకు మద్యం షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మరో బ్రాండ్ రకానికి చెందిన విస్కీ ఫుల్ బాటిల్ 77 రూపాయలకు సప్లై చేస్తే 540 కి మద్యం వ్యాపారులకు సరఫరా చేస్తోంది. ఈ రేట్లు సాధారణ మద్యం షాపులకు సంబంధించినవి మాత్రమే. కానీ మేడారం జాతరలో దీనికి అదనంగా 25.5 శాతం ప్రివిలేజ్ టాక్స్ కలిపి వసూలు చేస్తున్నారు. జాతరలో మద్యం లావాదేవీల వరకు మాత్రమే పరిశీలిస్తే రూ. 40 లక్షల మద్యాన్ని కంపెనీల నుండి కొనుగోలు చేయడం ద్వారా రూ. 4.00 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆదాయంగా సముపార్జిస్తోంది. గత జాతరలో రూ. 50.00 కోట్ల మద్యం విక్రయాలు సాగినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రతి జాతరలో మద్యం ధరలు విపరీతంగా పెంచుతున్న కారణంగా అధిక ధరలను భరించలేక భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీలు, పేదలు ఎక్కువగా వచ్చే మేడారం జాతరలో సాధారణం కన్నా దాదాపు 50 శాతం ధరలను పెంచి మద్యం అమ్మడం సరి కాదంటున్నారు. భక్తుల సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం అదనపు పన్నులు విధించడం, అధిక ధరలను నియంత్రించే చర్యలు తీసుకోకపోవడం సరికాదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.