(అమెరికా ‘ప్రతీకార చరిత్ర’ను తిరగరాసిన సులేమానీ అమరత్వం-2)
ఇరాకీ యువత సోషల్ మీడియా ద్వారా అక్టోబరు మొదటి తేదీ ఓ ఆందోళన ప్రారంభించింది. నిరుద్యోగం, నిరంతర విద్యుత్ సరఫరా, శుభ్రమైన త్రాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు అవినీతి పాలన రద్దు డిమాండ్ల తో ఇది ప్రారంభమైనది. గతంలో రాజకీయ అనుభవాలు లేని యువత తొలిసారి రోడ్డెక్కింది. గతంలో 2003 నుండి అమెరికా దురాక్రమణపై సద్దాం కి చెందిన బాతిస్టు పార్టీ ద్వారా రహస్య సాయుధ ప్రతిఘటన, అల్ సదర్ ముక్తాదా నేతృత్వంలో మెహిదీ ఆర్మీ ద్వారా సాయుధ ప్రతిఘటన, ఐసిస్ (ISIS) సంస్థ నేతృత్వంలో ప్రతిఘటన అనే గత మూడు దశలతో సంబంధం లేని యువత తొలి సారి పాల్గొన్న ఉద్యమమిది.
అమెరికా దురాక్రమణ (2003) తర్వాత పుట్టి పెరిగిన లేదా అప్పటికి పదేళ్ల లోపు పిల్లలే దీంట్లో ఎక్కువగా పాల్గొనడం గమనార్హం! ఇది బాగ్దాద్ లో నిరుడు అక్టోబర్ 1న ప్రారంభమైనది. వారంరోజుల్లోనే నసీరియా, నజాఫ్, కర్బలా పట్టణాలకు వ్యాపించింది. తర్వాత బాస్రాకి కూడా విస్తరించింది. అది పెద్ద ప్రజా వెల్లువగా మారింది. అది క్రమంగా సాయుధ బలగాలతో ముఖాముఖి సాయుధంగానే ఘర్షణపడే స్థితికి చేరసాగింది. తొలి ఐదు రోజుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 109 మంది మృతి చెందారు. 6 వేలమందికి పైగా గాయపడ్డారు. దీన్నిబట్టి ఉద్యమ విస్తృతి తెలుస్తుంది. అది ఎందుకు సార్వత్రిక సాయుధ రూపం తీసుకొని ఉంటుందో కూడా కొంతవరకు అంచనా వేయొచ్చు.
ఆయా ఆందోళనతో సంబంధం లేకుండా ఇరాక్ లో రాజకీయ అస్థిరత, సంక్షోభ స్థితిగతులు నిరంతరంగానే కొనసాగుతూ వుంది. ముఖ్యంగా ఇరాక్ లో ఇరాన్ రాజకీయ పరకాయ ప్రవేశం చేసిన ఓ నేపధ్యం కూడా వుంది. అది రెండు విధాలుగా జరిగింది. ఇది ఓవైపు ఇరాక్ ప్రభుత్వం (రాజ్యం)లో, మరో వైపు ఇరాక్ పౌరసమాజంలో జరిగింది. (ఆ వివరాలు మరో సందర్భంలో) ఫలితంగా తాను స్వయంగా దూరాక్రమించిన ఇరాక్ లో తానే నియమించిన కీలుబొమ్మ ప్రభుత్వంపై తన నియంత్రణ అమెరికాకి ఓ కొత్త సమస్యగా మారింది. ఇరాక్ లో ఇరాన్ రాజకీయ ప్రాబల్య నిర్మూలన దానికి తలనొప్పిగా మారింది. షియాల ఇరాన్ రాజ్య ప్రభావం నుండి తన కీలుబొమ్మ సర్కారు ని విముక్తి చేయడం అమెరికాకి ఓ క్లిష్ట కర్తవ్యంగానే మారింది. సరిగ్గా ఆయా రాజకీయ పరిస్థితుల్లో ఇరాకీ యువత దేశవ్యాప్త ఆందోళనకు దిగడం గమనార్హం!
తొలుత రాజకీయ పార్టీలు, సంస్థలతో సంబంధం లేకుండా ప్రారంభమైనప్పుటికీ, ఉద్యమ క్రమంలో ఇరాకీ యువతపై రాజకీయ ప్రభావం పడింది. వారిని బాతిస్టు పార్టీ రెచ్చగొడుతున్నదని ఒకసారి, ఇరాన్ రెచ్చగొడుతున్నదని మరోసారి అమెరికా & ఇరాకీ ప్రభుత్వ వర్గాలు ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంది. ఆయా రెండింటి రాజకీయ ప్రభావం కూడా తరతమ స్థాయిల్లో ఉండి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా! షియా అంశం వల్ల ఇరాన్ ప్రభావం బలంగానే ఉండొచ్చు. ఇరాన్ రాజకీయ ప్రభావంతో ఇరాక్ లో పని చేస్తున్న హిజ్బుల్ సంస్థ ఇరాక్ లో ఎలాగూ వుంది. అది ఈమధ్య బలపడుతూ వుంది. ఏ స్థాయి లో అనేది పక్కకు పెడితే, నేడు ఉద్యమిస్తున్న యువత ఇరాన్ నెట్ వర్క్ తో కనెక్ట్ కావడం ఓ భౌతిక సత్యం! అది అమెరికాకి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. (పై నెట్ వర్క్ కి కీలక సారధి సులేమానీ కావడం వల్ల ఆయన్ని అమెరికా గత కొంత కాలంగా అమెరికా లక్ష్యం గా చేసుకుంది. ఆ వెలుగులోనే తాజా హత్య జరిగింది) ఈ నేపథ్యంలో ఇటీవల ఇరాక్ లోని అమెరికా సైనిక శిబిరాలపై అడపా దడపా క్షిపణి దాడులు చోటు చేసుకుంటున్న స్థితిని అర్ధం చేసుకోవాల్సి వుంది.
ఇదీ చదవండి: అమెరికా ‘ప్రతీకార చరిత్ర’ను తిరగరాసిన సులేమానీ అమరత్వం!
అక్టోబరు 1న ప్రారంభమైన ప్రజా వెల్లువకు ఈ జనవరి 8 వ తేదీకి సరిగ్గా వంద రోజులు నిండింది. దీనికి ముందు ఆఖరి పది రోజుల్లో అతి తీవ్ర కల్లోల పరిస్థితి కొనసాగింది. డిసెంబర్ 27 న కిర్కుక్ లోని అమెరికా సైనిక స్తావరంపై క్షిపణి దాడిలో అమెరికన్ కాంట్రాక్టర్ మృతి, దానికి ప్రతీకారంగా మూడో రోజు 29న అమెరికా క్షిపణి దాడిలో సుమారు పాతిక మంది ఇరానీ ప్రభావిత హిజ్బుల్ తిరుగుబాటుదార్ల మృతి, దానికి ప్రతీకారంగా 31న దుర్బేధ్యమైన గ్రీన్ జోన్ లోకి సాహసోపేతంగా చొరబడి అమెరికన్ రాయబార కార్యాలయ ముట్టడి వరసగా జరిగాయి. కొనసాగింపుగా సులేమానీ హత్య, దానికి పెస్టికర్సనగా జనవరి 8 ఇరాన్ క్షిపణి దాడి జరిగాయి. అంటే డిసెంబర్ 27 నుండి జనవరి 8 మధ్య 13 రోజుల్లో వరసగా 6 సంచలన సంఘటనలతో అదో అతి తీవ్ర కల్లోల కాలంగా పేరొందింది. ఈ క్రమంలోనే కాకతాళీయంగానైనా సరిగ్గా శతదినం రోజే ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేయడం గమనార్హం!
ఇరాన్ చేసిన ఆయా ప్రతీకార క్షిపణి దాడి ఇరాక్ ప్రజల దృష్టిలో తమ ఆందోళనకి సరిగ్గా నూరో రోజు అమెరికా సైతాన్ కి తమ మిత్ర దేశం ఇరాన్ అందించే శతదినోత్సవ ‘కానుక’! ప్రపంచ పీడిత దేశాల ప్రజల దృష్టిలో 2020 లోకి ప్రవేశించే సందర్భాన అగ్రరాజ్యం అమెరికాకి తమ సాటి బాధిత దేశం ఇరాన్ కొత్త సంవత్సరం అందించిన కొత్త ‘బహుమానం’! ఇరాన్ ప్రజల దృష్టిలో ఏకపక్షంగా తమతో అణు ఒప్పందం రద్దు చేసుకొని, చమురు విక్రయంపై ఆంక్షలు విధించి, తమ దేశ ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్నందుకు, తమ దేశాధినేత సులేమానీని పొట్టన పెట్టుకున్న నేరానికి ప్రాధమిక, ప్రారంభ శిక్ష! ఒకవైపు ఇరాక్ ప్రజలకూ, మరో వైపు ఇరాన్ ప్రజలకూ, ఇంకో వైపు మొత్తం ప్రపంచ పీడిత ప్రజలకూ నూతన సంవత్సరం లో నూతనోత్సాహం కలిగించే పరిణామమిది. ఈ నేపధ్యం మూలాలు ఏవైనా కావచ్చు. కారణాలు ఎన్నైనా వుండొచ్చు. కానీ పైన పేర్కొన్న ప్రజల పరమ సంతోషానికి తక్షణ ఉత్ప్రేరకం ముమ్మాటికీ సులేమానీ అమరత్వమే!
ఒక్కొక్క చారిత్రిక దశలో ఒక్కొక్క అమరత్వం ప్రపంచ చరిత్ర పురోగమనానికి ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. ఏక ధ్రువ ప్రపంచంలో 32 దేశాల సంకీర్ణ సైనిక కూటమి సాగించిన యుద్ధోన్మాద దాడిని ధిక్కార చైతన్యంతో ఎదిరించి, తన దేశ ప్రజలకు స్ఫూర్తిదాతగా నిలిచి సద్దాం హుస్సేన్ రగిల్చిన నాటి సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ చైతన్య పునాది లేకుండా నేటి ఇరాక్ ప్రజా వెల్లువ లేదు. దేశంకోసం ఇద్దరు కన్న కొడుకులు, బుల్లి ముని మనుమడు సహా ఎందరో బంధుమిత్రుల్ని కోల్పోయి కూడా, మేరు పర్వతంగా నిలిచి, ఉరికంభంపై గంభీరంగా విప్లవ నినాదాలిస్తూ సద్దాం పొందిన అమరత్వం లేకుండా ఈనాటి ఇరాకీ ప్రజల వీరోచిత సజీవ జాతీయ విమోచనోద్యమం లేదు. అదేవిధంగా లిబియా ప్రజల ప్రియతమ నేత గడ్డాఫీ అమరత్వం లేకుండా నేటి లిబియా దేశ ప్రజల జాతీయ విమోచనోద్యమం లేదు.
ఔను, చరిత్ర నిర్మాతలైన ప్రజల పక్షాన తుదివరకు నిలిచి, వారి కోసమే అసువులు బాసిన యోధుల అమరత్వాలు ప్రజల గుండెల్లో నిలిచి పోతాయి. అవి వాళ్ళ చేతుల్లో పోరాట అస్త్రాలుగా మారతాయి. చరిత్ర నిర్మాణం లో అవి అంతర్భాగమౌతాయి. చరిత్ర పురోగమనానికి అవి ఉత్ప్రేరకాలుగా మారతాయి. అదే కోవలోకి ఇప్పుడు కాశిం సులేమానీ అమరత్వం కూడా వస్తుంది. వర్తమాన ప్రపంచ చరిత్ర గమనంలో అది మరెన్నో ఫలితాలిస్తుందని ఆశిద్దాం.
✍ ఇఫ్టూ ప్రసాద్