హైదరాబాద్ లో కూల్చివేతలకు పాల్పడుతున్న ‘హైడ్రా’ అధికారులపై తెలంగాణా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అనేక సూటి ప్రశ్నలను హైడ్రా అధికారులపై సంధించింది. అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ వర్చువల్ గా హాజరు కాగా, అమీన్ పూర్ తహశీల్దార్ కోర్టుకు హాజరయ్యారు.
విచారణ సందర్భంగా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు, ఇటు అమీన్ పూర్ తహశీల్దార్ కు హైకోర్టు సూటి ప్రశ్నలను సంధించింది. ఒకానొక దశలో కోర్టు అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హితవు చెప్పింది. ‘సెలవుల్లో నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారు? శని, ఆదివారాలు, సూర్యాస్తమయంలో కూల్చివేతలు ఎందుకు? ఆదివారం మీరు ఎందుకు పని చేయాలి? శని, ఆదివారాల్లో కూల్చివేయవద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి..కోర్టు తీర్పుల విషయం కూడా మీకు తెలియదా?’ అని అమీన్ పూర్ తహశీల్దార్ ను హైకోర్టు ప్రశ్నించింది. పై అధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్ధంగా పని చేయవద్దని హితవు చెప్పింది. అదేవిధంగా పొలిటికల్ బాసులను సంతృప్తి పరిచేందుకు అధికారులు పని చేయొద్దని, చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? కూల్చివేసే ముందు సంబంధిత యజమానికి చివరి అవకాశం ఇచ్చారా? ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెడతారు జాగ్రత్త..’ అని హైకోర్టు అధికారులను హెచ్చరించింది.
వర్చువల్ గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కూడా హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తహశీల్దార్ వినతి మేరకు చర్యలు తీసుకున్నట్లు రంగనాధ్ కోర్టుకు వివరణ ఇవ్వగా, తహశీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా? తహశీల్దార్ అడిగితే చార్మినార్ ను కూల్చేస్తారా? అని ప్రశ్నించింది. కూల్చివేతలకు యంత్రాలను, సిబ్బందిని అడిగితే సమకూర్చినట్లు రంగనాధ్ వివరణ ఇవ్వగా, చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ అడిగితే యంత్రాలను, సిబ్బందిని సమకూరుస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అడిగిన ప్రశ్నలకు దాటవేయకుండా జవాబులు ఇవ్వాలని రంగనాధ్ కు కోర్టు సూచించగా, కోర్టులపై తనకు అపారమైన గౌరవం ఉందని, కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని హైడ్రా కమిషనర్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో అమాయకులను ఇబ్బంది పెట్టవద్దని, హైడ్రా ఇలాగే వ్యవహరిస్తే స్టే విధించాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లవద్దని సూచించింది. అమీన్ పూర్ కూల్చివేతలపై విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటి వరకు స్టేటస్ కో పాటించాలని హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది.