ఆంధ్రప్రదేశ్ లో సస్పెన్షన్ కు గురైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు గతంలో ఖమ్మం ఎస్పీలుగా పనిచేశారు. ముంబయికి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ అరెస్టు అంశంలో వివాదాస్పదమై సస్పెన్షన్ వేటు పడిన ముగ్గురిలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు గతంలో ఖమ్మంలో జిల్లా ఎస్పీలుగా విధులు నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం నిన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు 1997 నవంబర్ 5వ తేదీ నుంచి 2000 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా 46వ ఎస్పీగా విధులు నిర్వహించారు.
అదేవిధంగా విజయవాడ సీపీగా పనిచేసి సస్పెండైన కాంతిరాణా టాటా కూడా దాదాపు ఏడాది పాటు ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఈయన 2010 ఏప్రిల్ 24వ తేదీ నుంచి 2011 ఏప్రిల్ 8వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా 56వ ఎస్పీగా విధులు నిర్వహించారు.