పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన కొందరు ఎమ్మెల్యేలపై తెలంగాణా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ అంశంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. నిర్దేశిత గడువులోపు నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా స్వీకరిస్తామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణాలో పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందగౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేస్తూ దానం నాగేందర్ పై వేటు వేయాలని కోరారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోవడం లేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఇరుపక్షాల ఫిర్యాదులను స్పీకర్ ముందు ఉంచాలని, ఇందుకు ఖరారు చేసిన తేదీలను హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పీకర్ కార్యాయ కార్యదర్శిని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రోగ్రెస్ ను తమకు నివేదించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.