ఎక్సైజ్ శాఖ ఎప్పుడూ నిజాలే చెబుతుంది. ఇందులో శంకించాల్సిది… సంశయించాల్సింది ఏమీ లేదు. కావాలంటే సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తుదారుడు అడిగిన సమాచారంపై ఆ శాఖ ఇచ్చిన సమాధానానికి ఒకింత నివ్వెరపోవలసి రావచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారుల పనితీరును, చిత్తశుద్ధితో కూడిన విధినిర్వహణను ఈ సందర్భంగా ప్రశంసించాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటారా…? అయితే చదవండి.
ఖమ్మం జిల్లా పరిధిలో ఎక్కడా బెల్టు షాపులు లేవట. జిల్లాలోని 122 వైన్ షాపులలో ఎక్కడ కూడా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు కేసులు నమోదు కాలేదుట. కానీ, గత డిసెంబర్ 1వ తేదీ నుంచి గత నెల 28వ తేదీ వరకు అంటే అయిదు నెలల వ్యవధిలో అనధికార మద్య విక్రయదారులపై 81 కేసులు నమోదు చేశారట. ఈ కేసుల్లో 68 మందిని అరెస్ట్ చేసి, 379 లీటర్ల ఐఎంఎల్ లిక్కర్ ను, 21.4 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నారట.
జిల్లాలోని బోనకల్ మండలం రావినూతలకు చెందిన షేక్ జానీ పాషా ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఎక్సైజ్ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఇది. అంతా బాగానే ఉంది కానీ అసలు బెల్టు షాపులే లేని జిల్లాలో అనధికార మద్యం విక్రయాల కేసులు, అరెస్టులు, హార్డ్ అండ్ చిల్డ్ రకాల లిక్కర్ సీసాల స్వాధీనం సంగతేమిటో…? మీకేమైనా బోధపడుతోందా??