రైతు బంధు పథకం అమలుపై అధికారిక మీడియాలోనేగాక, ఇతరత్రా భిన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. రైతు బంధు పథకాన్ని యథావిధిగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో రైతు బంధు పథకంపై సాగుతున్న ప్రచారాన్ని సీఎం తిప్పికొట్టినట్లయిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా తెలంగాణ రైతులు పండిస్తున్న వరిధాన్యాన్ని సేకరించేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ విషయమై రైతు వేదికల వద్ద సమావేశాలు నిర్వహించాలని, కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలని కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల, టీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సింగరేణిలో బొగ్గు గనుల ప్రైవేటీకరణతో గని కార్మికులు తమ ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని, సింగరేణికే ఆ బ్లాకులను అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందనీ, ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. అందరూ చురుగ్గా కలిసి పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. నాయకులకు ఓపిక ఉండాలని, పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులన్నీ క్రమంగా భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామని, మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని, మిల్లర్లతో ఒప్పందం ఉన్నోళ్లు వరి వేసుకోవచ్చని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.