నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు భగత్ కు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం బీ ఫారాన్ని అందించారు. మంగళవారం భగత్ తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. అనేక రాజకీయ సమీకరణలను, సామాజిక అంశాలను లోతుగా అంచనా వేసిన తర్వాతే భగత్ అభ్యర్థిత్వంపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. టీఆర్ఎస్ టికెట్ కోసం అనేకమంది ఆశావహులు పోటీపడినప్పటికీ, చివరికి నర్సింహయ్య కుమారుడు భగత్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.
కాగా నోముల నర్సింహయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటితకే తన అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. బీజేపీ సాగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కంకణాల నివేదితారెడ్డి ఇప్పటికే తన నామినేషన్ ను దాఖలు చేశారు. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించలేదు.