రెండు బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలంగాణా ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. ఆయా కార్పొరేట్ విద్యా సంస్థలు ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న అడ్మిషన్లు, స్కాలర్ షిప్ టెస్ట్ ను నిలిపివేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ, చిన్న ప్రైవేటు విద్యా సంస్థలన్నీ మూతపడగా, కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం ఓ భారీ పరీక్షకు సిద్ధపడ్డాయి. ఇందులో భాగంగానే స్కాలర్ షిప్ టెస్ట్ పేరుతో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి11.30 వరకు నిర్వహించేందుకు రెండు బడా కార్పొరేట్ విద్యా సంస్థలు సంసిద్ధమయ్యాయి. ఈమేరకు అవసరమైన భారీ ప్రచారం చేశాయి. టెస్ట్ నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే ఈ టెస్టులను నిలిపివేయాలని తెలంగాణా ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వును జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ తాజా ఉత్తర్వు ప్రకారం ఈ టెస్టులను ఆయా కార్పొరేట్ సంస్థలు నిలిపివేస్తాయా? లేక నిర్వహిస్తాయా? అనే అంశంపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.