ఖమ్మం నగరంలో నిన్న నిర్వహించిన ‘కమ్మ’ సామాజికవర్గ సమ్మేళనంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ‘ఖమ్మం కమ్మ సమ్మేళనంలో కలకలం!శీర్షికన నిన్న ts29 వెబ్ సైట్ ప్రచురించిన వార్త కథనంపై ఆయన ఫోన్ ద్వారా సోమవారం ఉదయం మాట్లాడారు. ఆదివారంనాటి ‘కమ్మ’ సమ్మేళనాన్ని పూర్తిగా తాను వ్యక్తిగతంగా నిర్వహించానని, తన ఖర్చుతో మాత్రమే ఆ సమావేశాన్ని జరిపినట్లు చెప్పారు. ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఇది పూర్తిగా వ్యక్తిగతంగా నిర్వహించిన సమ్మేళనం మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి కమ్మ సామాజికవర్గ కమ్మ ఆత్మీయులను ఆహ్వానించానని, ఎంపీ నామా నాగేశ్వరరావునుగాని, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును గాని తాను ఆహ్వానించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాత్రమే ఈ తరహా సామాజికవర్గ సమావేశాన్ని తాను నిర్వహించలేదని, భవిష్యత్తులోనూ మరిన్ని సామాజికవర్గాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తానని అజయ్ చెప్పారు. ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు కమ్మ సామాజికవర్గానికి మాత్రమే పరిమితం కాదని, తన నియోజకవర్గంలో ప్రాబల్యం గల పది సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ నిరంతరంగా సాగుతుందన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఒక్కో సామాజికవర్గ సమ్మేళనాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి అజయ్ వివరించారు.
అదేవిధంగా కొత్త బస్ స్టేషన్ ప్రారంభం, ప్రస్తుత బస్ స్టేషన్ కొనసాగింపు అంశంపై మంత్రి మాట్లాడుతూ, ఈ విషయంలో తాను చేసే శాశ్వత మంచి ఏమిటో నగర ప్రజలకు కాస్త ఆలస్యంగా బోధపడుతుందని మంత్రి చెప్పారు. ఇందులో ప్రజలకు మరింత మంచి జరిగే యోచనకు సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకున్న తర్వాత బహిరంగంగా వెల్లడిస్తానని మంత్రి చెప్పారు. పాత బస్ స్టేషన్ అంశంలో కొందరికి రాజకీయ ‘ఫ్రస్టేషన్’ ఉందని, తనకు అటువంటి అసహనం ఉండాల్సిన అవసరం లేదన్నారు. పది కాలాల పాటు నగర ప్రజలకు మేలు జరిగే విధంగానే తన నిర్ణయాలు ఉంటాయని, అయితే ప్రజల మంచికోసం తీసుకునే నిర్ణయాల ‘ఫలాలు’ వారికి అందడానికి కాస్త సమయం పడుతుందని అజయ్ కుమార్ చెప్పారు. తరాలు మారినా చెరగని విధంగా ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని రవాణా మంత్రి స్పష్టం చేశారు.