హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపాన బుధవారం జరిగిన ఈ ఘటన న్యాయవాద వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వామన్ రావు, నాగమణి దంపతులు మంథని కోర్టులో పనులు ముగించుకుని హైదరాబాద్ కు వెడుతుండగా దుండగులు అటకాయించి కారులోనే వారిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దుండగులు పొడవడంతో వామన్ రావు, నాగమణి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని పెద్దపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వారిద్దరూ తుదిశ్వాస విడిచారు.
కాగా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కొనఊపిరితో గల వామన్ రావు టీఆర్ఎస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ పేరును ప్రస్తావించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వామన్ రావు దంపతుల దారుణ హత్యోదంతాన్ని న్యాయవాద సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లాకప్ డెత్ గా ఆరోపణలు వచ్చిన ఓ కేసులోనేగాక, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆస్తులకు సంబంధించిన కేసును వామన్ రావు వాదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. భూ ఆక్రమణ వ్వవహారాల్లోనూ వామన్ రావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ హత్యలకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రకటించారు. నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.