ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 28వ తేదీన మోదీ హైదరాబాద్ వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఢిల్లీ నుంచి మోదీ నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత శామీర్ పేట సమీపంలోని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. ఈ సంస్థ తయారు చేస్తున్న ‘కోవాగ్జిన్’ కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలిస్తారు.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈనెల 29న ముగుస్తుండడం, అంతకు ఒకరోజు ముందుగా ప్రధాని హైదరాబాద్ కు వస్తుండడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సందర్భంగా ఏదేని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొంటారా? ఇందుకు సంబంధించి బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారా? అనే అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 28న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, 29న కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన కూడా ఖరారు కావడం రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది.