జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణా భవన్ లో కొద్ది సేపటి క్రితం ఓ కీలక సమావేశం జరిగింది. దాదాపు 35 బీసీ సంఘాలతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా మరికొందరు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.
బీసీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పాటుపడుతున్నదీ ఈ సమావేశంలో ఆయా మంత్రులు కూలంకషంగా వివరించారు. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశాన్ని ఇచ్చిన అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ టికెట్లను కూడా సింహభాగం బీసీలకే కేటాయించినట్లు మంత్రులు చెప్పారు. బీసీల సంక్షేమానికి తీవ్రంగా పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి మద్ధతునిచ్చి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అభ్యర్థించారు.
అంతా బాగానే ఉంది. సమావేశం విజయవంతమైనట్లు పార్టీ నేతలు భావించారు. కానీ, బీసీ సంఘాలతో నిర్వహించిన ఈ కీలక సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాస్తవానికి గంగుల కమలాకర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను నగరంలోనే నిర్వహిస్తున్నారు. తాాజా సమాచారం ప్రకారం నిన్న, మొన్నటి వరకు ఎర్రగడ్డ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమలాకర్ ఈరోజు మాత్రం హిమాయత్ నగర్ ఏరియాలో తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ లోనే అందుబాటులో గల బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణా భవన్ లో నిర్వహించిన వెనుకబడిన తరగతుల సంఘాల సమావేశంలో కనిపించకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. వాస్తవానికి బీసీ సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందనే విషయాలను ఆయా శాఖను చూస్తున్న మంత్రి మరింత వివరంగా, గణాంక వివరాలతో సహా చెప్పే అవకాశం ఉంది. కానీ బీసీ సంఘాల సమావేశంలో గంగుల కమలాకర్ ఎందుకు కనిపించలేదనే అంశమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.