వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు కలిగినప్పుడు రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అయితే బీమా వల్ల కలిగే ప్రయోజనాలను సైతం రైతులు పొందలేక పోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. పంటల బీమాకు సంబంధించి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడం వల్లనే వరద భీమా ప్రయోజనాలను రైతులు పొందలేక పోతున్నారన్నారు. ఈ పాపం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. పంట నష్టాలు ప్రభుత్వం అంచనాలు తయారు చేయలేక పోయిందని ఆయన విమర్శించారు. ముందస్తుగా వ్యవసాయ శాఖను సంఘం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కనీసం రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు,సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలకు పంపించిన పాపాన పోలేదన్నారు. పంట నష్టాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకొని కేంద్రానికి నివేదించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చాటేస్తున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టం సమాచారం తెప్పించుకుని కేంద్రానికి నివేదించాలన్నారు.
ఎకరాకు రూ. 30 వేల చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఎల్. రమణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే ప్రగతి భవన్ బద్దలు కొట్టేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని, నిరంకుశ పాలన మంచిది కాదన్నారు.
రైతుల ఆత్మహత్యలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక టీఆర్ఎస్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఉండబోవని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన కేసీఆర్ ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.